సినీ ప్రముఖులు ఆచితూచి మాట్లాడకపోతే వివాదానికి దారి తీస్తాయి. ప్రస్తుతం అటువంటి పరిస్థితే ఎదుర్కొన్నారు తెలుగు సీనియర్ విలన్ విజయ రంగరాజు. భైరవద్వీపం సినిమాలో మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న నటుడే విజయ రంగరాజు. కన్నడ సీనియర్ స్టార్ హీరో, దివంగత విష్ణువర్ధన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఏకంగా కన్నడ చిత్ర పరిశ్రమ మొత్తాన్ని ఆగ్రహానికి గురి చేసింది. దీంతో విజయరంగ రాజు కన్నీటిపర్యంతం అవుతూ బహిరంగ క్షమాపణలు కోరారు. ఇటివల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తాను విష్ణువర్ధన్ తో నటించిన ఓ కన్నడ సినిమా షూటింగ్ లో జరిగిన సంఘటనపై ఆయన వ్యాఖ్యానించారు.

‘ముత్తైదే భాగ్య’ అనే కన్నడ సినిమా షూటింగ్ సమయంలో తాను, విష్ణువర్ధన్ పాల్గొన్న సన్నివేశం వివరిస్తూ విష్ణువర్ధన్ పై విజయ రంగరాజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఏకంగా కన్నడ స్టార్ హీరోలు, పరిశ్రమ పెద్దలు విజయ రంగరాజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేశారు. సుదీప్, పునీత్ రాజ్ కుమార్, యాశ్, సుమలత.. వీరిలో ఉన్నారు. మన మధ్య లేని వ్యక్తిపై వ్యాఖ్యలు చేయడం సంస్కారం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయ భేదం లేకుండా తోటి ఆర్టిస్టుల్ని గౌరవించడం మన బాధ్యత అని యశ్, పునీత్ అన్నారు. విజయ రంగరాజు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమ విజయ రంగరాజుపై చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ అల్లుడు అనిరుధ్ జట్కర్ కోరారు. దీంతో విజయ రంగరాజు ఓ వీడియోలో స్పందించారు. తాను పొరపాటు చేశానన్నారు. తప్పుగా మాట్లాడినందుకు క్షమించాలని కన్నీటిపర్యంతమయ్యారు. విష్ణువర్ధన్ ఫ్యామిలీకి, ఫ్యాన్స్ కు, కన్నడ చిత్ర ప్రముఖులకు మనస్పూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. మీ కాళ్లు పట్టుకుంటాను. నన్ను వదిలేయండి. మరెప్పుడూ ఇటువంటి వ్యాఖ్యలు చేయను అంటూ తెలుగు, కన్నడ భాషల్లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.