విశ్వవిఖ్యాతా నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఇప్పటికే పోస్టర్స్ తో, సాంగ్స్ తో చేయాల్సిన రచ్చ చేసి… కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్న వర్మ, మరోసారి ‘ఎన్టీఆర్ ఎలైవ్’ అంటూ పెద్దాయన వర్ధంతి రోజున చిన్న వీడియో ప్రోమో రిలీజ్ చేశాడు..
వర్మ మార్క్ లైటింగ్, కెమెరా వర్క్ పుష్కలంగా కనిపించిన ఈ టీజర్ లో ఎన్టీఆర్ పాత్రలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. చీకట్లో దిగాలుగా, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కళ్లు మూసుకోని కూర్చున్న రామారావు, ఒక మెరుపు వెలుగులో నెమ్మదిగా కళ్లు తెరిచి… తల తిప్పి చూడడంతో ఈ వీడియో ముగిసింది. కేవలం ఎన్టీఆర్ పాత్రలోని వ్యక్తి లుక్ ని ఇంట్రడ్యూస్ చేయడానికే వర్మ ఈ వీడియోని వదిలాడు. ఎన్టీ రామారావు వర్ధంతి రోజున, ఎన్టీఆర్ ఎలైవ్ అంటూ ఈ టీజర్ వదలడంతో సోషల్ మీడియాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ వైరల్ అయ్యింది. సెన్సేషనల్ వ్యూస్ తెచ్చుకున్న ఈ టీజర్ లో అందరి చూపు ఎన్టీఆర్ పాత్రలో కనిపించిన వ్యక్తిపైనే పడింది. అచ్చం అన్నగారిని దించిన ఈ మనిషి ఎవరాని అందరూ చర్చించుకున్నారు. అంతలా ఎన్టీఆర్ లుక్ లో ఆకట్టుకున్న నటుడి పేరు రాకేష్.
రాకేష్ బేడీ, తూర్పు గోదావరి జిల్లాలో ఢిల్లీలో చదివిన వ్యక్తి. స్వతహాగా స్టేజ్ ఆర్టిస్ట్ అయిన రాకేష్, రెండు హిందీ సినిమాలు, మూడు సీరియళ్లు చేశాడు. కామెడీ పండించడంలో సిద్ధహస్తుడైన రాకేష్ ని రామ్ గోపాల్ వర్మ, ఎన్నో టెస్టులు చేసి, తెలుగు వచ్చిన వాళ్లు, ఎన్టీఆర్ లుక్ ఉన్న మాత్రమే కావాలని పట్టుబట్టి మరీ సినిమాలోకి తీసుకున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో రాకేష్, ఎన్టీఆర్ లా కనిపించే అవకాశం వచ్చిన తర్వాత రామారావు చివరి రోజుల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలు, ప్రసంగాలు విని, వీడియోలు చూసి.. ఆయన హవాభావాలని బాగా ప్రాక్టీస్ చేశాడు. ఈ కష్టానికి తగ్గ ఫలితమే ఇప్పుడు లుక్ బయటకి వచ్చాక కాంప్లిమెంట్స్ రూపంలో వస్తున్నాయి. స్టేజ్ ఆర్టిస్ట్ అంటే మంచి నటుడు అయి ఉంటాడు, అలాంటిది రామారావు ప్రసంగాలు, నడవడిక గురించి తెలుసుకోవడానికి ఇంత ప్రిపేర్ అయ్యాడు అంటే తెరపై అన్నగారే మళ్లీ కనిపించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
నిజానికి వర్మ ఆర్టిస్టుల సెలెక్షన్ ఎప్పుడూ సూపర్ గానే ఉంటుంది, తను ఏ సినిమా తీసిన అందులో నటించే వారి విషయంలో ప్రత్యేక జాగర్తలు తీసుకునే రామ్ గోపాల్ వర్మ, గతంలో తీసిన కిల్లింగ్ వీరప్పన్ సినిమా చూస్తే నిజమైన వీరప్పనే వచ్చాడా అనిపించకమానదు. ఇలా ప్రతిసారి ఆర్టిస్టుల విషయంలో ఆడియన్స్ కి షాక్ ఇచ్చే వర్మ, మరోసారి తన ప్రత్యేకతని చాటుకున్నాడు.