కరోనా, లాక్ డౌన్ కారణంగా ధియేటర్లు మూసేశారు. కొత్త సినిమాలు లేవు. దీంతో.. ఓటీటీల్లో విడుదలైన సినిమాలు చూశారు ప్రేక్షకులు. కానీ.. అందులో పెద్ద హీరోల సినిమాలేవీ లేవు. సౌత్ లో మహేశ్ తప్ప దాదాపు ప్రతి పెద్ద హీరో షూటింగ్ దశలోనే ఉంది. అయితే.. ప్రేక్షకులు మాత్రం కొత్త సినిమాల సందడి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇందుకు ట్విట్టర్లో తమ అభిమాన హీరో సినిమా అప్డేట్స్ కోసం మెసేజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ వివరాలను ట్విట్టర్ ఇండియా రిలీజ్ చేసింది. ర్యాంకులు కూడా ఇచ్చింది.
ట్విట్టర్ లో ఆడియన్స్ సెర్చ్ చేసిన సినిమాలను 2020 Most Tweeted about movies పేరుతో టాప్ టెన్ ర్యాంకులు ఇచ్చింది. ఈ ర్యాంకుల్లో తమిళ హీరో విజయ్ ‘మాస్టర్’ తో టాప్ పొజిషన్ లో నిలిచాడు. రెండో స్థానంలో ‘వకీల్ సాబ్’తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మూడో స్థానంలో ‘వాలిమై’తో అజిత్ నిలిచారు. ఇక వరుసగా మహేశ్.. సర్కారు వారి పాట, సూర్య.. సూరారిపొట్రు, రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్, బన్నీ.. పుష్ప, మహేశ్ సరిలేరు నీకెవ్వరు, యాశ్.. కేజీఎఫ్ చాప్టర్2, రజినీకాంత్.. దర్బార్ నిలిచాయి.
2020 Most Tweeted about actors-Male పేరుతో తమ హీరోల కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో కూడా టాప్ టెన్ ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఇందులో హీరోల కోసం సెర్చ్ చేశారు. వీరిలో మహేశ్ టాప్, పవన్ కల్యాణ్ రెండు, విజయ్ మూడో స్థానంలో నిలిచారు. వరుసగా.. ఎన్టీఆర్, సూర్య, అల్లు అర్జున్, రామ్ చరణ్, ధనుష్, మోహన్ లాల్, చిరంజీవి.. నిలిచారు. ఇలా సినిమాలు, హీరోల గురించి 2020కి టాప్ ట్రెండింగ్ లో నిలిచాయి.
2020 Most Tweeted about actors-Female పేరుతో హీరోయిన్స్ కోసం సెర్చ్ చేసిన టాప్ టెన్ ర్యాంకింగ్స్ లో.. కీర్తి సురేశ్ టాప్, కాజల్.. రెండు, సమంత.. మూడో స్థానాల్లో నిలిచారు. వరుసగా రష్మిక నాలుగు, పూజా హెగ్డే ఐదు, తాప్సీ ఆరు, తమన్నా ఏడు, రకుల్ ఎనిమిది, శ్రుతిహాసన్ తొమ్మిది, త్రిష పది స్థానాల్లో నిలిచారు. ఈ ట్రెండింగ్స్ ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి.