Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి స్పీడ్ మీద ఉన్నారు. ఒకపక్క రాజకీయాలు మరోపక్క సినిమా రంగంలో ఊహించని విధంగా దూసుకుపోతున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలు ప్రస్తుతం పవన్ చేస్తున్నన్ని సినిమాలు మరే హీరో చేయడం లేదని చెప్పవచ్చు. ఒకేసారి నాలుగు సినిమాలు సెట్స్ మీదకు తీసుకెళ్లడం జరిగింది. వీటిలో రెండు దాదాపు కంప్లీట్ అయిపోయాయి. మిగతా రెండు చూస్తే ఒకటి హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్”… మరొకటి సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఓజీ”. ఈ రెండిటిలో హరీష్ శంకర్ “ఉస్తాద్ భగత్ సింగ్” పై భారీ అంచనాలు పవన్ ఫ్యాన్స్ పెట్టుకోవడం జరిగింది.
ఎందుకంటే గతంలో హరీష్ దర్శకత్వంలో పవన్ నటించిన “గబ్బర్ సింగ్” పవన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి మే 11 వ తారీకు నాటికి 11 సంవత్సరాలు కావస్తు ఉండటంతో.. ప్రస్తుతం పవన్ తో చేస్తున్నా రెండో ప్రాజెక్ట్…”ఉస్తాద్ భగత్ సింగ్” ఫస్ట్ గ్లింప్స్ వీడియో ఆరోజు విడుదల చేయబోతున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ స్పష్టం చేశారు. చాలా గ్రాండ్ గా… అభిమానులు ఊహించని రీతిలో స్పెషల్ వీడియో ఉండబోతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే “గబ్బర్ సింగ్” లో మాదిరిగానే “ఉస్తాద్ భగత్ సింగ్” లో కూడా పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడం విశేషం. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పూజా హెగ్డే తో పాటు శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. హరీష్ శంకర్ స్వయంగా పవన్ అభిమాని కావడంతో… ఈ సినిమాపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరిగింది అంట. వాస్తవానికి మొదట భగత్ సింగ్ భవదీయుడు అనే టైటిల్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అయితే ఉన్నట్టుండి టైటిల్ మార్చి “ఉస్తాద్ భగత్ సింగ్” చేస్తున్నట్లు తెలపడం… ఒక్కసారిగా షూటింగ్ స్టార్ట్ కావటం వెంట వెంటనే షెడ్యూల్స్ కంప్లీట్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ క్రమంలో మే 11 వ తారీకు విడుదల కాబోయే స్పెషల్ వీడియో కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.