ఆమధ్య టాలీవుడ్ సీనియర్ స్టార్ వెంకటేశ్ ఓ సందర్భంలో అన్న మాట.. ‘తెలుగు ప్రేక్షకులు సినీ నటులను ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటారు’ అని. అది అక్షర సత్యం. తెలుగులో మెగాస్టార్ గా తిరుగులేని స్టార్ డమ్ ఉన్న ‘చిరంజీవి’ని చూస్తే ఈ మాట నిజమే అనిపించక మానదు. సహజంగానే అభిమానులు తమ హీరో గురించి గొప్పగానే చెప్పుకుంటారు. కానీ.. సమకాలీకులైన మరో స్టార్ హీరో, ఈ విషయాన్ని చెప్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఈ విషయాన్ని నిన్నటి బిగ్ బాస్ 4వ సీజన్ ఫైనల్లో తన తోటి స్టార్ నాగార్జున మెగాస్టార్ చిరంజీవి గురించి ఇదే చెప్పారు.
బిగ్ బాస్ మూడో సీజన్ ఫైనల్లో అదరగొట్టేసిన చిరంజీవి నాలుగో సీజన్ ను అంతకంటే ఎక్కువగా రక్తి కట్టించారు. చిరంజీవిని స్టేజీ మీదకు ఆహ్వానిస్తూ సాగిన నాగార్జున వ్యాఖ్యానం సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయి. చీఫ్ గెస్ట్ ను సహజంగా పొగుడుతారు నిర్వాహకులు, హోస్ట్ గా ఉన్నవారు. కానీ.. నాగార్జున వ్యాఖ్యలు చిరంజీవిని ప్రత్యేకంగా నిలిపాయి. ‘నా బిగ్ బ్రదర్, ఆత్మీయులు, మనసుకు నచ్చిన వ్యక్తి, ఇండస్ట్రీకి బిగ్ బాస్.. మెగాస్టార్ చిరంజీవి’ అంటూ సాగిన నాగార్జున వ్యాఖ్యానం చూసి మెగా అభిమానులు పులకించిపోతున్నారు. పైగా.. ఓ సందర్భంలో.. ‘చిరంజీవి గారు వరుసగా సినిమాలు చేస్తున్నారు.. మళ్లీ రూలింగ్ మొదలైపోయింది’ అనే మాట మరీ హోరెత్తించేస్తోంది.
వయసులోనూ.. సినిమాల్లోనూ దాదాపు చిరంజీవి సమకాలీకుడు, సౌత్ ఇండియాలోనే మరో సూపర్ స్టార్ అనదగ్గ నాగార్జున, అదీ తోటి తెలుగు హీరోనే ఇలా చిరంజీవి గురించి వ్యాఖ్యానించడం గ్రేట్ అనే చెప్పాలి. బిగ్ బాస్ ఫైనల్లో నాగార్జున, బిగ్ బాస్ నిర్వాహకుల నమ్మకాన్ని చిరంజీవి వంద శాతం నిలబెట్టారు. తనదైన మాటల చాతుర్యం, యువతను ప్రోత్సహించడం, సలహాలు ఇవ్వడంలో తన మార్క్ స్టైల్, గ్రేస్.. తో మొత్తంగా తనదైన హుందాతనాన్ని చూపించారు. టీఆర్పీ పరంగా బిగ్ బాస్ 4 ఫైనల్ కు మంచి రేటింగ్స్ వస్తాయనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.