దాదాపు 23 సినిమాలు చేసిన నానికి ఇండస్ట్రీలో మంచి పేరే ఉంది.. ఇప్పటి వరకు వివాదాలు లేకుండా నాని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని చేస్తున్న 24 వ సినిమా `గ్యాంగ్ లీడర్` ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో `గ్యాంగ్ లీడర్` ఒకటి. ఈ చిత్రం సీక్వెల్‌ను రాంచరణ్ చేస్తే బావుంటుందని కొన్ని నెలలు క్రితం వార్తలు కూడా వినిపించాయి. కానీ రాంచరణ్ కూడా మంచి కథ కుదిరితే చేద్దామనే అనుకుంటున్నాడు. మధ్యలో ఈ టైటిల్‌ను సాయిధరమ్ తేజ్ తన సినిమాకు పెట్టుకుందామని అనుకున్నా .. అతను మెగా కాంపౌండ్ హీరో అయినా కూడా అభిమానులు ఒప్పుకోలేదు. సాయిధరమ్ వేరే టైటిల్ పెట్టుకున్నాడు. అలాంటిది తన అభిమాన హీరో టైటిల్‌ను నాని ఎలా పెట్టుకుంటాడని మెగాభిమానులు గుర్రుగా ఉన్నారు. ఓ మెగా వర్గం అయితే హ్యాష్ ట్యాగ్ బాయ్‌కాట్ నాని పేరుతో గ్రూపు క్రియేట్ చేసి ఈ సినిమాను, హీరో నానిని ట్రోల్ చేయడం ప్రారభించారు.
ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు నానికి టైటిల్ పరంగా మరో సమస్య వచ్చి పడింది. అదేంటంటే.. మా బ్యానర్ మాణిక్యం మూవీస్‌లో గ్యాంగ్ లీడర్ టైటిల్‌ను రిజిష్టర్ చేయించామని నిర్మాత, హీరో మోహనకృష్ణ తెలిపారు. “గత ఏడాది అక్టోబర్‌లోనే టైటిల్‌ను రిజిష్టర్ చేయించాం. గోదావరి జిల్లాల్లో 40 రోజుల పాటు భారీ షెడ్యూల్‌ను కూడా ప్లాన్ చేసుకున్నాం. త్వరలోనే సెట్స్‌కు వెళదామని అనుకుంటున్న తరుణంలో ఇలా జరగడం బాధాకరం. ఆయన వీరాభిమానిని అయిన నేను సినిమాను మెగాస్టార్ చిరంజీవిగారి పుట్టినరోజున విడుదల చేయాలనుకున్నాను. వేరే మెగాహీరోలు ఇదేటైటిల్తో సినిమా చేస్తే ఇస్తాను కానీ.. వేరే వాళ్లకు ఇచ్చే ప్రసక్తేలేదు. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు నా టైటిల్ కోసం చాలారకాలుగా ట్రై చేశారు. నేను ఇవ్వనని చెప్పేశాను. అయితే వాళ్లు నా పర్మిషన్ లేకుండా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. అసలు చాంబర్ రూల్స్‌కు విరుద్ధంగా టైటిల్స్‌ను ఎలా అనౌన్స్ చేస్తారు“ అన్నారు మోహనకృష్ణ.
previous post