కొణిదెల వారింట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఫ్రెండ్స్ కి బ్యాచిలర్ పార్టీలు, మెగా ఫ్యామిలీ సభ్యులందరితో సరదాలు పూర్తయ్యాయి. వివాహ తేదీ దగ్గరపడుతూండటంతో నిహారికను పెళ్లి కూతురును కూడా చేసేశారు. ఈ తతంగంతో నాగబాబు ఇల్లంతా సందడిగా మారిపోయింది. ఇన్నాళ్లూ ఫ్యాన్సీ డ్రెస్సుల్లో కనిపించిన నిహారిక ఇప్పుడు చీరకట్టులో సిగ్గులమొగ్గే అయింది. పెళ్లికూతురుగా, చిలకపచ్చ రంగు చీరలో అందంగా ముస్తాబై మెరిసిపోతోంది.
గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యను నిహారిక వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఆగష్టులో వీరిద్దరి నిశ్చితార్ధం జరిగింది. పెద్దలు నిర్ణయించిన వీరి పెళ్లి ఈనెల 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరుగనుంది. ఇందుకు అక్కడి ఉదయ్ విలాస్ సిద్దమవుతోంది. ఆరోజు రాత్రి 7:15 నిముషాలకు నిహారిక-చైతన్య వివాహం జరుగబోతోంది. ఇందుకు సంబంధించి నిహారిక ఈరోజు పెళ్లి కూతురుగా ముస్తాబయింది. హైదరాబాద్ లోని ఆమె స్వగహంలో నిహారికకు పసుపు రాసి, మంగళ స్నానం చేయించారు. చిలకపచ్చ రంగు చీరలో నిహారిక మెరిసిపోతోంది.
వరుణ్ తేజ్ పెళ్లి పనులు దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇల్లంగా తోరణాలతో అలంకరించారు. ఇల్లంతా పెళ్లి సందడి నెలకొంది. తమ ముద్దుల చెల్లెల్ని చిరంజీవి కుమార్తెలు సుస్మిత, శ్రీజ, ఇతర బంధువులు దగ్గరుండి ముస్తాబు చేశారు. ఆ ఫొటోలను శ్రీజ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. ‘నా ముద్దుల చెల్లెలు పెళ్లి కూతురైంది..’ అని శ్రీజ తన ఇన్ స్టాలో పోస్ట్ ఫొటోలు పోస్ట్ చేసింది. ‘లవ్యూ.. స్వీటక్కా’ అని నిహారిక రిప్లై ఇచ్చింది. దీంతో కొణిదెల వారి ఇంటి పెళ్లి సందడి అందరినీ ఆకట్టుకుంటోంది. చిరంజీవి, రామ్ చరణ్ తమ షూటింగ్స్ నుంచి విరామం తీసుకుని పెళ్లి పనుల్లో జాయిన్ కానున్నారు.