ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంలో హీరోయిన్ ఇందు పాత్రలో నటించిన పాయల్ రాజ్‌పుత్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఆమె నటించిన తొలి సినిమా యూత్‌తోపాటు అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇందు పాత్రలో తనకంటే బాగా ఎవ్వరూ నటించలేరని పాయల్ చెబుతుంది. ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. హిందీలో మిలాన్ లుత్రియా దర్శకత్వం వహిస్తున్నారు. అహాన్‌శెట్టి, తారా సుతారియా జంటగా నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. తాను నటించిన తొలి సినిమా రీమేక్ గురించి పాయల్ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘ఆర్ఎక్స్ 100లో నేను చేసిన పాత్రకు హిందీ రీమేక్‌లో తారా సుతారియాను ఎంపికచేయడం బాగానే ఉంది. కానీ, ఆ పాత్రలో నాకంటే బాగా ఎవ్వరూ నటించలేరని కచ్చితంగా చెప్పగలను. అయితే సాజిద్ సర్ ఆమెను కథానాయికగా ఎంపిక చేశారంటే ఆమెలో ఏదో టాలెంట్ ఉండే ఉంటుంది కదా..! ‘ఆర్ఎక్స్ 100’లో నా పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుంది. తొలి సినిమాలోనే అలాంటి సన్నివేశాల్లో నటించాలా.. అని కాస్త సందేహపడ్డాను. తొలి సినిమాలోనే ఇలాంటి సన్నివేశాలు చేయకూడదని భావించే కొందరి ఆలోచనలను నేను తప్పని నిరూపించాలనుకున్నాను. ‘ఆర్ఎక్స్ 100’లో ఏ నటీ చేయలేని పాత్ర చేశాను కాబట్టే నాకు ఇంతటి ప్రేక్షకాదరణ లభించింది’’ అంటూ చెప్పుకొచ్చింది.
previous post