ఎన్టీఆర్ : ఇటీవలే నటరత్న ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. దాంతో ఎన్టీఆర్ కుటుంబానికి ఆగస్ట్ నెల అచ్చిరావడం లేదని కొంతమంది అంటున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆగస్టు నెలలోనే రెండుసార్లు పదవి నుంచి తప్పించడం జరిగింది. దాంతో నందమూరి కుటుంబానికి ఆగస్టు నెల కలిసి రావడం లేదని నమ్మకం బలపడింది. కానీ చిత్ర సీమలో మాత్రం ఎన్టీఆర్ కు అతని వారసులకు ఆగస్ట్ నెల బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇటీవలే నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ సినిమా విజయం దానికి నిదర్శనం.
ఆగస్టు నెల సెంటిమెంట్
నిజానికి చిత్రం పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఆగస్ట్ నెల బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఎన్టీఆర్, భానుమతి నటించిన ‘చండీరాణి’ సినిమా 1953 ఆగస్ట్ 28న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై 100 రోజులకు పైగా ఆడింది. ఆ తరువాత ఎన్టీఆర్, భానుమతి నటించిన ఇంకో సినిమా ‘అగ్గిరాముడు’ చిత్రం 1954 ఆగస్ట్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తరువాతనే ఎన్టీఆర్కి ‘రాముడు’ అనే బిరుదు వచ్చింది. ఎన్టీఆర్ 30 ఏళ్ల సినీ జీవితంలో 28 చిత్రాల్లో నటించాడు. వాటిలో 19 సినిమాలు విజయం సాధించగా మిగితా 9 సినిమాలు పరాజయం పాలయ్యాయి.
దానికి నిదర్శనాలివే…
ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో “చండీరాణి, అగ్గిరాముడు, వినాయక చవితి, మంచి మనసుకు మంచి రోజులు, జగదేకవీరుని కథ, బందిపోటు, వీరాభిమన్యు, దేవుడు చేసిన మనుషులు ” లాంటి సూపర్ హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ నటించిన ‘దేశోద్ధారకుడు’ సినిమా 1986 ఆగస్టులో విడుదలై సూపర్ హిట్ అయింది. అలాగే ఎన్టీఆర్ మరో వారసుడు నందమూరి హరికృష్ణ నటించిన ‘సీతయ్య’ సినిమా 2003 ఆగస్టు 22న విడుదలై మంచి విజయం సాధించింది. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘యమదొంగ’ సినిమా 2007 ఆగస్టు 15న విడుదలై అతనికి కెరీర్లోనే మైలురాయిగా నిలిచింది. అదే ఫ్యామిలీకి చెందిన నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసారా’ సినిమా 2022 ఆగస్టు 5న రిలీజ్ అయి విజయపదంగా నడుస్తుంది. ఇదంతా చూసిన తర్వాత చిత్ర పరిశ్రమలో ఆగస్టు నెల నందమూరి కుటుంబానికి బాగా అచ్చు వచ్చిందనే చెప్పాలి.