మరీ దిగజారిపోయింది

రెండు భాగాలుగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్‌పై నందమూరి అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు. ముఖ్యంగా మాస్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. కానీ గత నెల రిలీజైన కథానాయకుడు ఊహించని రేంజ్‌లో భాక్సాఫీస్ వద్ద దారుణంగా ప్లాప్ టాక్ తెచ్చుకోని బయ్యర్లని, డిస్ట్రిబ్యూట‌ర్ల‌ని నిండా ముంచింది. ఇక సెకండ్ పార్ట్ మహానాయకుడు అయినా హిట్ అవుతుందనుకుంటే ఇదీ దారుణమైన టాక్ తెచ్చుకుంది. కథానాయకుడుకి ఓవర్సీస్‌లో ప్రీమియర్‌ షోస్‌కు నాలుగు లక్షల డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి కానీ మహానాయకుడు ప్రీమియర్‌ షోస్‌కు కేవలం లక్షా పద్నాలుగు వందల అరవై డాలర్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా మ‌హానాయ‌కుడు కలెక్షన్స్ చాలా డల్‌గా ఉన్నాయి. ఈ చిత్రం ఓపెనింగ్స్ చూసి ఇప్పుడు నందమూరి అభిమానులు షాక్ అవుతున్నారు. నిజంగానే ఇది బాల‌య్య సినిమానా లేదంటే ఏదైనా చిన్న హీరో సినిమానా అంటూ ఆశ్చర్యపోతున్నారు. క‌థానాయ‌కుడు సినిమాకు క‌నీసం 50 శాతం ఆక్యుపెన్సీ వ‌చ్చింది కానీ మహానాయకుడు మొదటి రోజు కోటి రూపాయల షేర్‌ కూడా సాధించలేకపోయింది. ఫస్ట్ డేనే చాలా వీక్ కలెక్షన్స్ రావడంతో మహానాయకుడుకు కూడా భారీ నష్టాలు తప్పవని తెలుస్తోంది. డిజాస్టర్ అయిన క‌థానాయ‌కుడుతో పోల్చినా కూడా మహానాయకుడు కలెక్షన్స్ చాలా దారుణంగా దిగ‌జారిపోయాయి. ఈ వీక్ ఎండ్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం బాలయ్య సినీ కెరీర్ లోనే ఇదో పెద్ద డిజాస్టర్ గా నిలవడం ఖాయం.