‘మహానాయకుడు’ మూవీ రివ్యూ

కథానాయకుడు ఫ్లాప్ అయిన తర్వాత డైలమాలో పడిన మహానాయకుడు సినిమా మార్పులు చేర్పులతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కథానాయకుడు ముగింపు దగ్గరి నుంచి మొదలైన ఈ సినిమాలో ఎన్టీఆర్… టీడీపీని స్థాపించడం నుంచి మొదటిసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవడం వరకూ ఫస్ట్ హాఫ్ గా.., రామారావుకి నాదెండ్ల ద్రోహం చేయడం, మోసం చేసి సీఎం అవ్వడం, ఆ తర్వాత అన్నగారు అన్ని పార్టీలని కలుపుకొని తెలుగోడి సత్తా ఢిల్లీ వరకూ వినిపించేలా చేసిన విధానం, రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే సీన్‌తో మహానాయకుడు సినిమా ముగిసింది. అయితే మహానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ కనిపించకపోవడం సినిమాకే పెద్ద లోటుగా కనిపిస్తుంది. అదేంటి ఎన్టీఆర్ సినిమాలో రామారావు కనిపించకుండా ఉండడమేంటని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది టీడీపీకి ఉపయోగపడేలా తీసిన సినిమా. ఇందులో బాబు పాత్ర కాకపోతే ఇంకెవరు కనిపిస్తారు.

మహానాయకుడు మొదటి భాగం అదే ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా కనిపించిన చంద్రబాబు నాయుడు టీడీపీలోకి ఎలా వచ్చాడు, పార్టీలో ఎలా ఎదిగాడు, ఎన్టీఆర్ కి నాదెండ్ల ద్రోహం చేసిన సమయంలో చంద్రబాబు నాయుడు ఎంత తెలివిగా వ్యవహరించాడు అనేదే సెకండ్ హాఫ్ అంతా ఉంది. రామారావుపై అవిశ్వాస తీర్మానం సమయంలో జరిగిన పొలిటికల్ డ్రామాని తెరపై బాగానే చూపించారు కానీ అవన్నీ బాబుని హైలైట్ చేయడానికే రాసుకున్న సన్నివేశాల్లాగా చూపించారు తప్ప వెండితెర ఇలవేల్పుగా ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ పడిన కష్టాన్ని చూపించలేకపోయారు. అందువల్ల ఆడియెన్స్ ఎక్కడా సినిమాకి కనెక్ట్‌ కాలేకపోయారు.

అందరికీ తెలిసిన కథే అయినా కూడా కథనాన్ని ఆసక్తిగా రాసుకోవడంలో క్రిష్ పూర్తిగా విఫలమయ్యాడు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ బాగున్నాడు, విద్యాబాలన్ బసవతారకమ్మ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది. మిగిలినవారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు కానీ రానా మాత్రం అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో రానా నటన సూపర్బ్ గా ఉంది. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మహానాయకుడు సినిమాకి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ప్రధాన బలాలు. పొలిటికల్ డ్రామాకి స్కోప్ ఉంది కాబట్టి క్రిష్ కథనాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్‌గా రాసుకొని ఉంటే బాగుండేది. మొత్తానికి ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా కథానాయకుడు రిజల్ట్ ని రిపీట్ చేసేలా ఉంది.