చిరంజీవి అన్నయ్య అభిమానాన్ని ఎవరూ బద్దలు కొట్టలేరని జనసేనాని పవన్‌కల్యాణ్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటించిన చిత్రం `సైరా నరసింహారెడ్డి`. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈవేడుకకి జనసేనాని పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ “నేను అన్నయ్య చిరంజీవికి ఓ అభిమానిని. మీరు నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నారంటే అందుకు కారణం ఆయన మాకు నేర్పిన పాఠాలే. నేను ఇది వరకు ఓ అభిమానిగా ఆయన గురించిన విషయాన్ని నేను చెప్పాను. ఇంటర్ విద్యార్థులు కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఘటన నన్ను బాధించింది. నేను కూడా అలా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నప్పుడు మా వదిన, చిన్నన్నయ్య నన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్లారు. `నీజీవితం ఇంటర్ పాస్ కావడం వల్లే పూర్తవుతుందని నేను అనుకోవడం లేదు. నువ్వింకా చాలా ఎత్తుకు ఎదగాలి` అని ఆరోజు నాకు ఆయన భరోసా ఇచ్చారు. అలాంటి వ్యక్తులు అందరి ఇళ్లలోనూ ఉండాలి.
ప్రపంచ దేశాలన్నీ భారతదేశంపై దాడి చేశాయి. ఏనాడు భారతదేశం ఇతర దేశాలపై దాడి చేయలేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలాంటి వ్యక్తుల సమూహమే మన దేశం. ఆయన జీవిత చరిత్రను చరణ్ ఏమాత్రం స్వార్ధం చూసుకోకుండా నిర్మిస్తే, సురేందర్ రెడ్డి గొప్పగా తీశారు. రేపు ఉయ్యాలవాడ అంటే చిరంజీవిగారే గుర్తుకొస్తారు. ఈ కథను ఇంకేవరితోనూ చేయలేరు. ఈ నా దేశం కోసం తీసిన సినిమా కాబట్టి ఈ సినిమాకు నా గొంతు ఇచ్చాను. సినిమా పరిశ్రమలో చాలా పోటీతత్వం ఉంది. అయితే ఈ పోటీతత్వాన్ని మేం ఎప్పుడూ ఆహ్వానిస్తుంటాం. ఎవరు ఎన్ని విజయాలు సాధించినా మేం అసూయపడం. ఎందుకంటే మేం అంతా సినిమా జాతి“ అన్నారు.
previous post
next post