‘పింక్’ రిమేక్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్నాడన్న వార్తలపై క్లారిటీ రాకముందే.. ఆయనకు సంబంధించి మరో అప్డేట్ బయటకొచ్చింది. సినిమా కోసం 20 రోజులు డేట్స్ ఇచ్చారని సమాచారం. ఫిబ్రవరిలో షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తుంది. జనసేన పార్టీ కార్యకలాపాలతో బిజీబిజీగా ఉన్న ఆయన.. అతి కష్టం మీద ఈ సమయం ఇచ్చారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఏటా రెండు సినిమాల్లో నటించాలని పవన్ నిర్ణయించుకున్నట్టు టాలీవుడ్ టాక్. తక్కువ వ్యవధిలో పాత్ర ప్రాధాన్యతను బట్టి సినిమాలు చేయాలనుకుంటున్నారట. సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండకుండా.. కొన్ని ఎంపిక చేసుకున్న సినిమాలు చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పింక్ రిమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు పొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 7న ప్రారంభం కానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, తమన్ సంగీతమందిస్తున్నాడు. నివేతా థామస్, శత్రు ప్రస్తుతానికి ఎంపికయ్యారు.