Pawan Kalyan: పవన్ కల్యాణ్ Pawan Kalyan ఇమేజ్, ప్రేక్షకాభిమానుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పేదేమీ లేదు. 2001లో ఖుషి సంచలన విజయం తర్వాత ఆస్థాయి హిట్ చూడటానికి పవన్ కు పదేళ్లు పట్టింది. ఈ గ్యాప్ లో పవన్ చేసిన 9 సినిమాల్లో జల్సా మినహా హిట్ సినిమా లేకపోయింది. ఇన్నేళ్లు ఫ్లాపుల్లో ఓ స్టార్ హీరో ఉంటే ఆయన కెరీర్ మీద, బిజినెస్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కానీ.. పవన్ కెరీర్ ఇందుకు భిన్నంగా మరింత పెరిగింది. ఇంతటి ఇంపాక్ట్ చూపిన పవన్ కెరీర్లో రెండుసార్లు తన సినిమాల విడుదల విషయంలో ప్రతిబంధకాలు ఎదుర్కొన్నారు. అయితే.. రెండుసార్లు కూడా విజయం సాధించడం విశేషం.
తన కెరీర్లో తొలిసారి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న సినిమా ‘అత్తారింటికి దారేది’. ఏపీలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. తెలంగాణలో కూడా పరిస్థితులు బాలేదు. ఆ సమయంలో ఎడిటింగ్ పూర్తైన క్వాలిటీ ప్రింట్ యధాతథంగా సెప్టెంబర్ 24న లీక్ అయిపోయింది. మరునాటికి దాదాపు అందరి సెల్ ఫోన్లలోకి సినిమా చేరిపోయింది. వెంటనే తేరుకున్న యూనిట్ ఆఘమేఘాల మీద సినిమా విడుదల 27న అని ప్రకటించింది. అంతటి ప్రతికూల పరిస్థితుల మధ్య విడుదలైన అత్తారింటికి దారేది.. తిరుగులేని విజయం సాధించింది. హైక్వాలిటీ ప్రింట్ తమ ఫోన్లలో ఉన్నా కూడా ప్రేక్షకులు సినిమాకు అద్భుత విజయం కట్టబెట్టారు. నాలుగేళ్లుగా చెరగని మగధీర రికార్డులను చెరిపేసి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
రీసెంట్ గా వకీల్ సాబ్ సమయంలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు మారుతున్నాయి. అయినా.. ఏప్రిల్ 9న ధైర్యం చేసి విడుదల చేశారు. అయితే.. అనుకోని కుదుపు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చింది. వీటిని కూడా అధిగమించి సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించి వారంలో 100 కోట్లు మార్కు దాటింది. పది రోజుల్లో సినిమా సేఫ్ లోకి వెళ్లిపోయింది. పరిస్థితులు బాగుండుంటే మరిన్ని వసూళ్లు వచ్చేవే. ఇలా రెండుసార్లు పవన్ కల్యాణ్ సినిమా విడుదల సమయంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని పవన్ సినిమాలు నిలబడ్డాయి. ప్రేక్షకుల్లో పవన్ మ్యానియాకు ఇదొక నిదర్శనం అని చెప్పాలి.