టాలీవుడ్ ఏస్ డైరక్టర్ పూరి జగన్నాధ్ క్రియేటివిటీ గురించి తెలిసిందే. మాస్ మేనరిజమ్స్, డైలాగ్స్, హీరో ఎలివేషన్ లో పూరి మార్కే వేరు. తన సినిమాల్లో హీరోయిజం, దేశభక్తి, సోషల్ మెసేజ్.. ఇలా ఏదొక అంశాన్ని జోడించడం పూరి స్పెషాలిటీ. కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్స్ లేకపోవడంతో అందరూ ఇళ్లలో ఉండాలని.. ప్రపంచంలోని సమస్యలతో పోలిస్తే మనం సేఫ్ గా ఉండటానికి ఇళ్లలో ఉండటం పెద్ద సమస్య కాదంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇలాంటి అనేక విషయాల్ని, తాను లైఫ్ లో చూసిన అనేక అనుభవాల్ని పూరి మ్యూసింగ్స్ పేరుతో అయిదు నిముషాల ఆడియో రూపంలో చెప్పుకొస్తున్నాడు.
ఇందులో పర్సనల్ ఫీలింగ్స్, సంస్కృతి, లైఫ్, పెళ్లి, కెరీర్, ఇన్స్ పిరేషన్, బుద్దిజం, బుక్స్.. ఇలా ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ తన మ్యూసింగ్స్ తో చెప్పుకొస్తున్నాడు. ఇవన్నీ విన్నవారు తమ తమ అభిప్రాయాల్ని కూడా చెప్తున్నారు. పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉన్న పూరి జగన్నాద్ ప్రతి విషయాన్నీ విశదీకరిస్తున్నాడు. సినిమా షూటింగ్స్ తో ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాడు. అక్కడి విధానం, ప్రకృతి, వ్యవహారికం, ప్రజలు, సంస్కృతిని వివరిస్తున్నాడు. ముఖ్యంగా యూత్ తమ కెరీర్ గురించి ఎంతో జాగ్రత్త తీసుకోవాలని చెప్తూ వారిని ప్రోత్సహిస్తున్నాడు. మనసును నచ్చిన పనిని మాత్రమే చేయాలంటూ వారిలో ఓ క్లారిటీ తీసుకొస్తున్నాడు.
పూరి మ్యూసింగ్స్ లో ఎక్కువగా నిజ జీవితంలో అందరూ పాటించేవే ఎక్కువగా ఉంటున్నాయి. వ్యక్తిత్వ వికాసం, కంఫర్ట్ జోన్, గ్రేట్ మైండ్స్, కుకింగ్, బర్త్ కంట్రోల్.. లాంటివే కాకుండా ఇన్ సెట్స్, ఈఫిల్ టవర్, అమెరికా.. ఒకటి కాదు అనేక విషయాలపై పూరి తన స్టైల్లో చెప్తున్నాడు. యుక్త వయసులోనే టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలంటూ చిన్నగా సినిమా భాషలో చెప్తున్న పూరి మాటలు ఎనర్జీ ఇస్తాయనే చెప్పాలి. సినిమాల్లో షార్ట్ డైలాగ్స్ తో రఫ్పాడించే పూరి.. తాను ఎక్కువగా సుత్తి కొట్టదలచుకోలేదని అంటున్నాడు. బోర్ కొడుతుందని మీకు అనిపించేలోపే తాను చెప్పడం ఆపేసేలా అయిదు నిముషాల్లోపే ముగించేస్తానని చెప్తున్నాడు. జీవితాన్ని అనేక కోణాల్లో చూసుంటాడు కాబట్టే ఇలా చెప్పగలుగుతున్నాడని చెప్పకతప్పదు.