Coolest Director: దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) సినిమాలో ఓ చిన్న పాత్ర చేసినా జన్మ ధన్యమవుతుందని అగ్ర సినీ తారలు కూడా కోరుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. బాహుబలి సినిమాలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ (RRR film) సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. జనవరి 7వ తేదీన వెండితెరపై సందడి చేయనున్న ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ బద్దలు చేస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాజమౌళి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. వరల్డ్ వైడ్ గా ఉన్న 50 కూలెస్ట్ ఫిల్మ్ మేకర్స్ (coolest filmmakers)లో రాజమౌళికి టైమ్ఔట్ (TimeOut) మ్యాగజైన్ స్థానం కల్పించింది.
రాజమౌళికి ఘనత వెనుక కారణం
ఆదరాబాదరాగా సినిమాలు చేసేసి ప్రేక్షకులపై రుద్దే మనస్తత్వం భూతద్దం పెట్టి చూసినా రాజమౌళిలో అసలు కనిపించదు. ఒక డిఫరెంట్ స్టోరీని ఆసక్తికరంగా మలచడంలో.. దానిని స్క్రీన్ పై బోల్డ్ గా ప్రజెంట్ చేయడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా. పాత కాలంలో ఫాంటసీ చిత్రాలు తీసారేమో కానీ మొన్నటిదాకా భారతీయ దర్శకులు కమర్షియల్ సినిమాలకే పరిమితం అయ్యారు. కానీ రాజమౌళి ఒక ముందడుగు వేసి అద్భుతమైన బాహుబలి లాంటి స్టోరీని దృశ్యకావ్యంగా మలిచి అందరికీ కనుల విందు చేశారు.
25వ ర్యాంకు
ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది గొప్ప దర్శకులు ఉన్నారు. వందల భాషల్లో ఎప్పటికప్పుడు మైండ్ బ్లోయింగ్ సినిమాలు రూపొందిస్తూ ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నారు దర్శకులు. అలాంటి దర్శక దిగ్గజాలలో రాజమౌళి 25వ ర్యాంకు సంపాదించారు. తాజాగా లండన్ ఆధారిత పబ్లికేషన్ టైమ్ఔట్ మ్యాగజైన్ రాజమౌళిని ప్రపంచంలోని మోస్ట్ డెడికేటెడ్/కూలెస్ట్ దర్శకుల్లో ఒకరిగా ప్రకటించింది. ఈ అరుదైన ఘనత ఒక్క భారతీయుడికే.. అదీ మన తెలుగువాడికే దక్కడం మనందరికీ గర్వకారణం. బాలీవుడ్ ఇప్పటివరకు చూపించని కొత్త కోణాన్ని చూపించి తెలుగు సినిమాతో వందల కోట్ల అభిమానులను సంపాదించుకున్న రాజమౌళి చాలా గొప్ప అన్నట్లు టైమ్ఔట్ మ్యాగజైన్ పేర్కొంది. రాజమౌళి సినిమాల్లో సెంటిమెంట్ తో పాటు కథ, కథనం అద్భుతంగా ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. ఎలాంటి నటుడు లేదా నటీమణిని అయినా ఎలివేట్ చేయడంలో రాజమౌళికి పెట్టింది పేరు. ఆ లక్షణాలే అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.