సూపర్ స్టార్ రజినీకాంత్.. 45 ఏళ్ల కెరీర్.. 168 సినిమాలు. ఇన్నేళ్ల కెరీర్లో ఆయన ఎక్కని మెట్టు లేదు. ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించారు. స్టైల్‌కు ఆయనో చిరునామా అయ్యారు. అయితే సినిమాల పరంగా ఆయనకు రెండు కోర్కెలు ఉన్నాయట. ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించాలని ఉందట. అలాగే ఓ మరాఠా చేయాలనుందట. దర్బార్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆయన చెప్పిన మాటలివి. సోమవారం సాయంత్రం దర్బార్ ట్రైలర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఏదైనా చేయలేని పాత్ర మీ మదిలో ఉందా అని మీడియా అడగగా.. ట్రాన్స్‌జెండర్ పాత్ర చేయాలనుందని ఆయన అన్నారు. ఎవరైనా ఆ పాత్ర కోసం సంప్రదించారా అని అడగగా.. లేదని.. ఇప్పుడే అలాంటి ఆలోచన వచ్చిందన్నారు. ఇక మరాఠా సినిమా చేసే అవకాశం వచ్చినా.. చర్చలకే పరిమితమైపోయిందన్నారు. రజినీ మూలాలు మహారాష్ట్రకు చెందినవన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్. బెంగుళూరుకు వలస వచ్చిన వీరి కుటుంబం అక్కడే స్థిరపడిపోయింది. సినిమాల్లోకి వచ్చాక రజినీకాంత్‌గా పేరు మారింది. ఆయన గురువు, ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్.. ఈ పేరు పెట్టారు. తాను ఇంట్లో ఇప్పటికీ మరాఠీ మాట్లాడుతుంటానని ఆయన అన్నారు.
ఇక ఈ సినిమాలో రజినీ.. పోలీస్ పాత్రలో నటించారు. దాదాపు 27ఏళ్ల తర్వాత పోలీస్‌గా మెప్పించేందుకు సిద్ధమయ్యారు. పోలీస్ పాత్రల్లో సీరియస్‌నెస్ ఉంటుందని.. అందుకే ఆ పాత్రలపై పెద్దగా ఆసక్తి చూపనన్నారు. జాలీగా నడిచిపోయే పాత్రలు చేయాలంటేనే తనకు ఇష్టమన్నారు. మురుగుదాస్ డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అనిరుధ్ సంగీత దర్శకత్వం వహించారు.