నూర్ మహమ్మద్ అంటే మెగా ఫ్యామిలీకి ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేము. ఆయన అకాల మరణంతో మెగా హీరోలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిరంజీవి అభిమాన సంఘానికి అధ్యక్షుడైన నూర్.. ఆదివారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. అంతేకాదు తనకు బిహైండ్ వుడ్స్ అందించిన గోల్డ్ మెడల్‌ను కూడా ఆయనకు అంకితమిచ్చారు. రంగస్థలంలో నటనకు గానూ చెర్రీకి గోల్డ్ మెడల్ అందించింది బిహైండ్‌వుడ్స్. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి సతీసమేతంగా చరణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూర్ మహమ్మద్‌తో తనకున్న అనుబంధాన్ని రామ్ చరణ్ గుర్తు చేసుకున్నారు. గత 12 ఏళ్లుగా తనను, తన తండ్రి చిరంజీవిని ఎంతో ప్రోత్సహిస్తూ వస్తున్న నూర్.. తమ కుటుంబానికి చిరకాల ఆప్తుడని పేర్కొన్నారు. ఈ విషాదకరమైన రోజు తనకు ఈ గౌరవం దక్కిందని.. ఈ అవార్డును తనే ఇచ్చాడని భావిస్తున్నానన్నాడు. అభిమానులే తమను నటులుగా తీర్చిదిద్దుతున్నారన్నాడు. అందుకే ఈ అవార్డును నూర్ అబ్బాజాన్‌కు అంకితమిస్తున్నానంటూ తన అప్యాయతను, గౌరవాన్ని చెర్రీ చాటుకున్నాడు. అభిమాని పట్ల చెర్రీ చూపించిన గౌరవానికి సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. చెర్రీ మంచి మనసుకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నారు.