Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా “గేమ్ ఛేంజర్”. సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. దాదాపు ఏడాదికి పైగా నుండి షూటింగ్ జరుపుకుంటూ ఉంది. రామ్ చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. చరణ్ కెరియర్ లోనే ఇది అత్యంత హై బడ్జెట్ సినిమా. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకి కథ అందించిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన “జిగర్ తండా డబుల్ X” మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ లోనే మొదటి పొలిటికల్ స్టోరీ “గేమ్ ఛేంజర్” అని స్పష్టం చేశారు. స్టోరీ రాసిన తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్స్ కి వినిపించాను. కథ విన్న వాళ్లంతా చాలా బాగుంది. శంకర్ లాంటి దర్శకులు స్థాయిలో స్టోరీ ఉంది. ఇంకా కొద్దిగా మార్పులు చేర్పులు చేసి చాలా పెద్దగా కూడా చేయవచ్చు అని స్నేహితులు సలహాలు ఇచ్చారు. ఆ రకంగా స్టోరీలో మంచి మెసేజ్ తో పాటు దానికి రాజకీయాన్ని జోడించి రాసుకున్నాను. స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యాక ఇది చాలా పెద్ద పొలిటికల్ మూవీ.. తీసే అనుభవం ఉన్న దర్శకుడు తీస్తేనే బాగుంటుందని అనిపించింది.
ఎందుకంటే రాసుకున్న కథకి తీసే కెపాసిటీ నాకు లేదు. దీంతో కథను పట్టుకొని శంకర్ సార్ కి వినిపించాను. స్టోరీ వినగానే ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆ తర్వాత సినిమా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు అని ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ క్రమంలో రామ్ చరణ్ వంటి స్టార్ హీరోతో ఈ సినిమాను రూపొందించడంతో మరింతగా సినిమా స్థాయి పెరిగిందని “గేమ్ ఛేంజర్” స్టోరీ రైటర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తెలియజేయడం జరిగింది. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని పేర్కొన్నారు.