ఇండస్ట్రీలో ఓ హీరో సినిమా బ్లాక్ బస్టర్ లేదా ఇండస్ట్రీ హిట్ అయితే.. తర్వాత వెంటనే వచ్చే సినిమా అదే స్థాయి అంచనాలను అందుకోవడంలో విఫలమవుతారు. చిరంజీవి కూడా కొన్నిసార్లు తప్పితే దాదాపు ఆ రికార్డు మెయింటైన్ చేశారు. మరే హీరో కూడా ఇండస్ట్రీ హిట్ తర్వాత అదే స్థాయి హిట్ అందుకోలేదు. ఈ లిస్టులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఉన్నాడు. ‘మగధీర’ వంటి భారీ ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమా ‘ఆరెంజ్’. ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని చూసింది. ఈ సినిమా విడుదలై నేటితో 10 ఏళ్లు పూర్తయ్యాయి.
నవంబర్ 26’ 2010 న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కమర్షియల్ విజయం సాధించలేదు. యూత్ బేస్డ్ కంటెంట్, అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ తో ఈ లవ్ స్టోరీ తెరకెక్కింది. దీనికి మన ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు. కానీ.. పదేళ్లయినా ఆరెంజ్ సినిమా ప్రస్తావన వస్తే మొదట గుర్తొచ్చేది సినిమాలోని పాటల గురించే. తమిళ మ్యూజిక్ డైరక్టర్ హ్యారిస్ జైరాజ్ అందించిన సంగీతం సినిమాకు మెయిన్ ఎస్సెట్. ప్రతి పాట సూపర్ హిట్టే. పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సినిమా ఎక్కువ భాగం ఆస్ట్రేలియాలోనే చిత్రీకరించారు. దీంతో పాటలన్నీ ఎంతో కలర్ ఫుల్ గా, ధియేటర్ ఎక్స్ పీరియన్స్ పరంగా ఎంతో ఆకట్టుకుంటాయి.
‘మగధీర’లో హై యాక్షన్, గుర్రపుస్వారీ చేసిన చరణ్.. ఆరెంజ్ లో లవర్ బాయ్ గా కూడా ఆకట్టుకున్నాడు. అయితే.. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ సినిమా స్క్రీన్ ప్లే పరంగా కాస్త జాగ్రత్తలు తీసుకునుంటే సినిమా హిట్ అయ్యేదని అభిమానులు అంటూంటారు. ఇలాంటి పాటలున్న సినిమాకు అలాంటి ఫలితం ఇప్పటికీ అర్ధం కని విషయమే. సినిమాను అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించారు. కథకు మించిన ఖర్చు, అదుపుతప్పిన ప్రొడక్షన్ ఫ్లాప్ టాక్ తో నిర్మాతగా భారీ నష్టాలను చూశారు. ఏదేమైనా.. పాటల పరంగా సినిమా ఇప్పటికీ ఓ స్వీట్ ఎక్స్ పీరియన్స్ అని చెప్పాలి. #DecadeForCultClassicORANGE అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.