Vyooham Teaser: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొలిటికల్ కెరియర్ లో ప్రధాన అంశాలను తీసుకుని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన “వ్యూహం” సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం విడుదల చేయడం జరిగింది. ఈ “వ్యూహం” టీజర్ లో 2009 నుంచి 2014 వరకు జగన్ రాజకీయ జీవితంలో ఏం జరిగింది..? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి వంటివి చూపించడం జరిగింది. ప్రధానంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం టీజర్ ప్రారంభించి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న భావోద్వేగ వాతావరణంతో పాటు… వైయస్ కుటుంబంలో మరియు వైయస్ రాజకీయ అనుచర వర్గంలో ఆయన చనిపోయాక చోటు చేసుకున్న పరిస్థితులను ఈ టీజర్ లో చూపించారు.
ప్రప్రదమంగా తండ్రి వైయస్ మరణాన్ని జగన్ ఏ రకంగా తీసుకున్నారు.. కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడ్డారు వంటివి అద్భుతంగా చూపించడం జరిగింది. ఓదార్పు యాత్ర చేస్తుండగా వైఎస్ జగన్ పై సిబిఐ దాడులు ఇంకా వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టడం చూపిస్తూనే మరోపక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని పరోక్షంగా నెగిటివ్ గా టీజర్ లో చూపించడం జరిగింది. దర్శకుడు రాంగోపాల్ వర్మ వైఎస్ జగన్ పొలిటికల్ కెరియర్ ప్రారంభం నుండి పార్టీ పెట్టినదాకా చోటు చేసుకున్న పరిణామాలను “వ్యూహం” ఆ తరువాత 2019 ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి తధానంతరం జరిగిన పరిణామాలపై “శపథం”.. సినిమాలు తీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలకు ముందే ఈ రెండు సినిమాలు విడుదలయ్య రీతిలో ఆర్జీవి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ రెండు సినిమాలు కోసం చాలా సందర్భాలలో ఆర్జీవి సీఎం జగన్ తో భేటీ అయ్యి అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది. అయితే వ్యక్తిగతంగా తనకు జగన్ అంటే అభిమానం కారణంగా.. వ్యూహం, శపథం సినిమాలు చేస్తున్నట్లు చాలా ఇంటర్వ్యూలలో ఆర్జీవి తెలియజేశారు. తాజాగా విడుదలైన వ్యూహం టీజర్ ఏపీ రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. సినిమాలో వైయస్ జగన్ పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించారు.