తప్పు దర్శకుడిది కాదు…

మణికర్ణిక… వీరనారి ఝాన్సీ లక్ష్మీ భాయ్ కథతో తెరకెక్కిన భారీ బడ్జట్ సినిమా. ప్రీ-ఇండిపెండెన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాని క్రిష్ మొదలు పెట్టాడు, దాదాపు షూటింగ్ అంతా పూర్తి అవుతోంది అనుకుంటున్న సమయంలో కంగనాతో మనస్పర్థల కారణంగా క్రిష్ ప్రాజెక్ట్ నుంచి పక్కకి వచ్చేశాడు. మధ్యలో ఆగిపోయిన మణికర్ణికని కంగనా ముందుండి నడిపించి పూర్తి చేసింది. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమాపై డివైడ్ టాక్ వినిపిస్తోంది. ఝాన్సీ రాణీని అద్భుతంగా ఎలివేట్ చేశారు కానీ చరిత్ర చెప్పని నిజాలని ఏమైనా చూపిస్తారేమోననే ఆశతో థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులకి మాత్రం నిరాశ తప్పలేదు.
నిజానికి మణికర్ణిక సినిమాకి మొదటి నుంచీ ప్రతీదీ దగ్గరుండి చూసుకున్న క్రిష్, పక్కకి తప్పుకోవడంతో అతను తప్పు చేశాడంటూ విమర్శించిన వాళ్లు చాలా మందే ఉన్నారు. సినిమా విడుదల ముందు నుంచే విమర్శలు ఫేస్ చేస్తున్న క్రిష్ పై ఇప్పుడు మరిన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మణికర్ణికలో కొత్త విషయాలు లేవని, క్రిష్ కథని అస్తవ్యస్థంగా సిద్ధం చేశాడని ఝాన్సీ రాణీ గొప్పదనం చూపించాలనే తొందరలో క్రిష్ తప్పు చేశాడని మణికర్ణిక చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేస్తున్నారు.
మణికర్ణిక మొదలైనప్పటి నుంచీ విడుదల వరకూ జరిగిన పరిణామాలు చూస్తుంటే ఇప్పుడు వినిపిస్తున్న విమర్శలకి క్రిష్ కి అసలు సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తోంది. క్రిష్ సిద్ధం చేసిన కథ చాలా గొప్పది, అంతే గొప్పగా 75% తెరకెక్కించాడు కానీ కంగనాకి క్రిష్ కి మధ్య మాటలు పొసగకపోవడంతో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఈ సమయంలో ఒక పెద్దాయన ఎక్కువ చొరవ తీసుకోని కంగనాని రెచ్చగొట్టి ఆమెనే దర్శకత్వంలో వహించేలా చేశాడు. అతని పేరు చెప్పకపోయినా సినిమా గురించి కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా ఆ పెద్ద మనిషెవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఒకసారి లాక్ అయిపోయి సెట్స్ పైకి వెళ్లిపోయిన కథని మళ్లీ మార్పులు చేసి, రీషూట్స్ జరిగి మణికర్ణిక డిలే అవ్వడానికి కారణం కూడా ఆ పెద్ద మనిషే. సో ఇప్పుడు మనం చూసిన మణికర్ణికకి క్రిష్ రెడీ చేసిన మణికర్ణికకి చాలా తేడా ఉంది కాబట్టి సినీ అభిమానుల నుంచి వినిపిస్తున్న ప్రతి విమర్శా దర్శకుడిని నమ్మని కంగనాకి, ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం చేశాక కూడా పనిగట్టుకొని మార్పులు చేసిన ఆ పెద్దాయనకే దక్కుతుంది.