కొన్ని సినిమాలు ఎంత హిట్ అవుతాయో.. ఆయా సినిమాల్లోని పాటలు, డైలాగులు కూడా అంతే హిట్ అవుతాయి. ఒక్కోసారి సినిమాలు హిట్ కాకపోయినా.. పాటలు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి మ్యాజిక్ ను తమిళ హీరో ధనుష్ చేశాడు. ఒకసారి కాదు.. ఏకంగా రెండు సార్లు.. రెండు తమిళ సినిమాలతో.. రెండు పాటలతో. ఈ రెండు సినిమాల్లో ఒకటి అట్టర్ ఫ్లాప్, మరొకటి యావరేజ్. సినిమాలు ఫ్లాపయినా పాటలతో హిట్ అయ్యాడు ధనుష్. ఆ రెండు సినిమాల్లో ఒకటి ‘3’.. రెండోది ‘మారి-2’. ఈ రెండు సినిమాల్లో హీరో ధనుష్. ఇంతకీ ఆ హీరో సాధించిన రికార్డులు ఏంటంటే..
2011లో ధనుష్ హీరోగా రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ‘3’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే.. అంతకు ముందు ‘వై దిస్ కొలవెరి..’ అనే పాటను ప్రమోషన్ కోసం రికార్డింగ్ స్టూడియో నుంచే షూట్ చేశారు. అప్పట్లో ఆ పాట, మేకింగ్ వీడియో యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. చాలా క్యాజువల్ గా షూట్ చేసిన ఆ పాట సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పటికి 25కోట్ల మందికి పైగా వీక్షించారు. దీంతో ఆ పాట సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. అనిరుధ్ ఈ పాటకు సంగీతం అంందించాడు.
2019లో ధనుష్ నటించిన మారి-2 సినిమాలోని ‘రౌడీ బేబీ’ అంతకు మూడు రెట్లు రికార్డులు క్రియేట్ చేసింది. ఏకంగా యూ ట్యూబ్లో 1బిలియన్ వ్యూస్ తో ఇప్పట్లో మరెవరూ చేరుకోలేనంత రికార్డులు క్రియేట్ చేసింది. తొమ్మిదేళ్ల క్రితం కొలవెరి.. పాట రిలీజ్ అయిన నవంబర్ 16నే.. రౌడీ బేబీ పాట 1బిలియన్ వ్యూస్ రికార్డు చేరుకోవడం విశేషం. యువన్ శంకర్ రాజా ట్యూన్స్ కు ధనుష్, సాయిపల్లవి డ్యాన్స్, పిక్చరైజేషన్ స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యాయి. ప్రభుదేవా, జానీ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేశారు. యూట్యూబ్ హయ్యస్ట్ వ్యూస్ వచ్చిన పాటల్లో ‘రౌడీ బేబీ’ 15వ స్థానంలో నిలవడం విశేషం.