RRR movie: దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇందులో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ అలియా భట్, ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటించారు. ఇతర ముఖ్యమైన పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్, శ్రీయలు కనిపించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 7న అట్టహాసంగా మొత్తం 14 భాషల్లో విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా విజృంభిస్తుండడంతో మేకర్స్ సినిమాను వాయిదా వేసేశారు.
దీంతో కరోనా పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో.. ఆర్ఆర్ఆర్ ఎప్పుడు విడుదల అవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇక ఇప్పటి వరకు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు విడుదల వాయిదా పడటంతో.. ఆర్ఆర్ఆర్ కు అన్ని వైపుల నుంచీ అనేక కష్టాలు మొదలయ్యాయి. తాజాగా డిస్ట్రిబ్యూటర్లు సైతం మీ సినిమా మాకొద్దు, మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయమంటూ డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత దానయ్యలను ఒత్తిడి చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ గుసగుసలే నిజమైతే రాజమౌళి నిండా మునగడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.