మళ్లీ మొదలు పెట్టారు

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకి దర్శక ధీరుడు రాజమౌళి రెండేళ్ల తర్వాత అయినా చెప్పాడు కానీ ఇప్పటికే 39ఏళ్లు వచ్చిన ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అంటే మాత్రం సమాధానం దొరకట్లేదు. టాలీవుడ్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లో ఒకరైన మన డార్లింగ్ కి, లేడీ సూపర్ స్టార్ దేవసేన అనుష్కకి మధ్య లవ్ అఫైర్ నడుస్తుందంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. వాళ్లు నటించిన సినిమాల్లో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఉండడం, బయట కూడా ఇద్దరు బాగా క్లోజ్ గా ఉండడంతో ఆ పుకార్లు నిజమనే వాదన బలంగా వినిపించింది.

బిల్లా సినిమాతో మొదలైన వీరి స్నేహం, మిర్చితో కొంచెం బలపడింది, ఆ తర్వాత అయిదేళ్ల పాటు బాహుబలి సినిమాకి కలిసి పనిచేయడంతో ప్రభాస్-అనుష్కల మధ్య స్నేహం హద్దులు దాటిందని ఎవరికి తోచింది వాళ్లు అనుకునే వారు. అయితే ఈ ఇద్దరు ప్రేమ వ్యవహారాన్ని ఖండిస్తూనే ఉన్నారు. దీంతో గత కొంత కాలంగా ఆ వార్తలు కాస్త తగ్గాయి కానీ ప్రభాస్ చేసిన ఒక్క కామెంట్ వలన మళ్లీ ఇద్దరి ప్రేమ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.

రీసెంట్ గా ప్రభాస్, రానా, రాజమౌళిలో కాఫీ విత్ కరణ్ షోకి వెళ్లారు, ఇందులో కరణ్ వేసిన రెండు మూడు ప్రశ్నలకి అనుష్కపేరే ఆన్సర్ చేసిన ప్రభాస్, ఎవరినైనా ప్రేమిస్తున్నారా అనే క్వేషన్ కి నో అనే ఆన్సర్ చెప్పాడు. ఇక్కడితో అయిపోతే బాగానే ఉండేది కానీ ఆ తర్వాత కాఫీ విత్ కరణ్ షోలో చెప్పినదంతా అబద్ధమేనా అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అవును అనే సమాధానం ఇవ్వడంతో, ప్రభాస్ అనుష్క గురించి చెప్పింది కూడా అబద్ధమే కాబట్టి, వారి మధ్య ఎదో ఉందంటూ మళ్లీ వార్తలు మొదలయ్యాయి. దీంతో ఎప్పటిలాగే ప్రభాస్, అనుష్క ఫ్యాన్స్ ఇద్దరూ కలిసున్న ఫోటోలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.