సమంత ఇంకొక్కసారి ఆ పనిచేస్తోందా? అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఇంతకీ ఆ పని ఏ పని అని అనుకుంటున్నారా? ఆమెకు తెలిసిన పనే. నటనే. కాకపోతే అక్కినేని కుటుంబం కోసం. అక్కినేని నాగచైతన్య సరసన ఆమె నాయికగా నాలుగు సినిమాలు చేసింది. ఇకపోతే ఆ ఫ్యామిలీలో నాగార్జున సినిమాల్లో కూడా అడపాదడపా కనిపిస్తూనే ఉంది. పెళ్లయిన వెంటనే రిలీజైన `రాజుగారి గది2`లో సమంత ఉంది. దాంతో పాటు ప్రస్తుతం `మన్మథుడు2`లోనూ ఆమె నటిస్తోంది. ఈ రెండు సినిమాలను పక్కనపెడితే మరోసారి ఆమె అక్కినేని ఫ్యామిలీ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా పేరు `వెంకీమామ`. ఇందులో నాగచైతన్య, వెంకటేష్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో సమంత కీలక పాత్రలో కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత మూడు రోజులుగా కాశ్మీర్లో సమంత ఉండటం ఈ వార్తలకు బలాన్నిచ్చినట్టు అవుతోంది. ప్రస్తుతం ఫెహల్గామ్ (కాశ్మీర్)లో వెంకీమామ షూటింగ్ జరుగుతోంది. గత మూడు రోజులుగా సమంత అక్కడే ఉన్నారు. ఆమె మాత్రమే కాదు, ఆమె పర్సనల్ స్టాఫ్ కూడా అక్కడికి ఆమెతో పాటు వెళ్లడమే, అందరికీ అనుమానం కలిగిస్తోంది. ఆమెతో పాటు ముఖ్యంగా ఆమె మేకప్ ఆర్టిస్ట్ కూడా లొకేషన్లో ఉన్నారు. వీటన్నిటినీ బట్టి చూస్తే సమంత అతిథి పాత్రలో కనిపించడం ఖాయమని అర్థమవుతోంది. కాకపోతే సినిమా యూనిట్ దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
previous post
next post