మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి సంబంధించిన గొడవలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనపడటం లేదు. కొత్తగా జరిగిన మా ఎన్నికల్లో నరేష్ అధ్యక్షుడిగా ఎన్నిక కాగా.. జీవితా రాజశేఖర్ కార్యదర్శిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే తమ ప్యానెల్‌ను శివాజీ రాజా వర్గం ప్రమాణ స్వీకారం చేయనీయడం లేదని ఇటీవల మా కొత్త అధ్యక్షుడు నరేష్ ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారు. దానికి ప్రతిగా శివాజీ రాజా మంగళవారం ప్రెస్‌మీట్ పెట్టారు. ఆయన మాట్లాడుతూ…
“నేను ఎవరి ప్రమాణ స్వీకారానికి అడ్డు పడటం లేదు. `మా` పరువును రోడ్డు మీదకు లాగకండి. ఇతరులను బాధ పెట్టేలా వ్యాఖ్యలు చేయడం ఆపాలి. ఎన్నికలు తర్వాత ఎవరైనా హుందాగా ప్రవర్తించాల. ఇంతకు ముందు ఇన్ని రాజకీయాలు `మా`లో ఉండేవి కావు. గత నాలుగేళ్లుగానే రాజకీయాలు మొదలయ్యాయి. ఎవరికీ జీతాలు ఉండవు. 26 మంది.. 800 మంది కోసం పాటు పడతారు. నేను ఈసీ మెంబర్ నుండి ప్రెసిడెంట్ వరకు 22 సంవత్సరాలు `మా`లో పనిచేశాను. నేను రూల్స్ ప్రకారమే చేస్తున్నాను. ఏప్రిల్ 1న ప్రమాణ స్వీకారం జరగాలి. నేను గతసారి అలాగే చేశాను. ఓడిపోయిన తర్వాత ఆఫీస్‌కి వెళ్లే అవసరం నాకులేదు కాబట్టి నేను ఆఫీస్‌కి వెళ్లడం లేదు. ఎవరికీ ఏ కష్టం వచ్చినా నేను ముందుంటాను. నడిగర్ సంఘం కోసం మలేషియా వెళ్లినప్పుడు మేం సాధారణ గదుల్లో ఉంటే.. నరేష్ ఖరీదైన గదిని బుక్ చేసుకున్నారు. అప్పుడు మా డబ్బులు అనవసరం ఖర్చు అవుతున్నాయని గుర్తుకు రాలేదా. నా అపార్ట్మెంట్స్ కోట్లు విలువ చేస్తాయి అనే నరేష్‌గారు మా కోసం ఒక రూపాయి కూడా ఇవ్వలేదే. మా సొమ్మును నేను ఖర్చు చేస్తున్నానని చెప్పడం తప్పు కదా. అధ్యక్షుడిగా గెలిచిన నరేష్ `మా` అభివృద్ధికి కష్టపడాల. ఇలా ఇతరుల్ని బాధ పెడితే ఎలా? 2.90 కోట్ల రూపాయలు ఉన్న బ్యాలెన్స్‌ను శివాజీ 5 కోట్లు చేశాడు. నేను దాన్ని 10 కోట్లు చేయాలని కసితో పనిచేయండి. నేను వృద్ధాశ్రమం కట్టాలని అనుకున్నాను. కడితే.. పేరంతా నాకే వస్తుందని కొంత మంది కలిసి చేసిన కుట్ర కారణంగానే ఓడిపోయాను. `శివాజీ నువ్వు చాలా కష్టపడుతున్నావ్.. కె.టి.ఆర్తో మాట్లాడి భూమి ఇప్పిస్తాను అన్నారు చిరంజీవిగారు. అన్నట్లుగానే 24గంటల్లో ఫోన్ చేశారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే నాగబాబు నాకు 30 ఏళ్లుగా తెలుసు. నాకు గిఫ్ట్ ఇచ్చాడు. త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. తను గురించి ఇక్కడ మాట్లాడకూడదు. అలాగే మా కోసం ప్రతి ఏడాది డైరీ రూపొందిస్తాం. ఈసారి డైరీ నేను చేస్తానని నరేష్ అన్నారు. డైరీల ద్వారా 14.20 లక్షల రూపాయలు వచ్చిందని ఆయనే చెప్పారు. మరి అకౌంట్లో 7 లక్షలే పడింది. మిగిలిన 7 లక్షలు ఏమయ్యాయి.? అడగాల్సిన బాధ్యతగా భావించి అడుగుతున్నాను. రేపు నేనే లెక్కలు అప్ప చెప్పాలి. ఆ సొమ్ము ఏమైందో చెప్పి నరేష్ ప్రమాణ స్వీకారం చేస్తే బావుంటుంది. మేనిఫెస్టోలో ఏం చెప్పారో అవన్నీ చేయండి. మాటలు సరిగ్గా ఉండాలి. `మా`తో ఉన్న 22 ఏళ్ల అనుబంధం కారణంగా ఏ పని ఉన్నా సరే! నేను వచ్చి చేస్తాను“ అన్నారు.
previous post
next post