Rajamouli Thaman: దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే టాప్ మోస్ట్ దర్శకుడు “అవతార్” సినిమా సృష్టికర్త జేమ్స్ కామెరూన్ స్వయంగా జక్కన్న నీ ప్రపంచంలోనే మీరు ఇప్పుడు అగ్రగామి దర్శకుడు అని కితాబు ఇవ్వటం జరిగింది. ఇదే సమయంలో “RRR” పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకోవటంతో పాటు ఆస్కార్ ఫైనల్ నామినేషన్ లిస్ట్ లో కూడా చోటు దక్కించుకోవడం తెలిసిందే. ఈ పరిణామంతో రాజమౌళి స్థాయి మరింతగా పెరిగింది. “RRR”లో “నాటు నాటు” ఆస్కార్ బరిలో నిలిచింది. దీంతో సౌత్ మొదలుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోలు అనేకమంది నిర్మాతలు ఇంకా హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు సైతం రాజమౌళితో సినిమాలు చేయటానికి క్యూ కొడుతున్నారు.
రాజమౌళి నుంచి పిలుపు వస్తే చాలు…చాలా మంది ఎదురుచూస్తున్నారు. మ్యూజిక్ దర్శకులు సైతం జక్కన్న వద్ద ఒక ఛాన్స్ వస్తే బాగుంటుందని ఎంతో ఆత్రుతతో ఉన్నారు. అటువంటి రాజమౌళి పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విషయంలోకి వెళ్తే రిపబ్లిక్ డే నేపథ్యంలో ఓ తెలుగు ప్రముఖ న్యూస్ ఛానల్ కి తమన్ ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా సినిమాలకు సంగీతం అందించే విషయంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవటం జరుగుతాయో అన్నిటినీ వివరించడం జరిగింది. వారసుడు సినిమా చూసిన తర్వాత ఎమోషనల్ అయిన క్రమంలో… దాని గురించి మాట్లాడుతూ విజయ్ తో సినిమా చేయటం.. తన చిరకాల డ్రీమ్ అని.. ఇన్నాళ్లకు అది నెరవేరింది అని చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో “RRR”..”నాటు నాటు” సాంగ్ ఆస్కార్ కి నామినేట్ కావటంపై స్పందించడం జరిగింది. కచ్చితంగా నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుస్తుందని తమన్ చెప్పుకొచ్చారు. రాజమౌళి గారు అందరికీ ఒక మార్గం చూపించారు. మూడేళ్ల పాటు అక్కడే ఉండే సినిమాను ప్రమోట్ చేయడం జరిగింది.. అని ప్రశంసలు కురిపించాడు.
ఇక ఇదే సమయంలో రాజమౌళి గారి సినిమాల్లో ఎప్పుడూ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారేనా… నాకు అవకాశం వస్తే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అని.. యాంకర్ తమన్ నీ ప్రశ్నించడం జరిగింది. దీనికి ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. “లేదు నాకు ఆ అవసరం లేదు. దేవిశ్రీప్రసాద్ తో పనిచేసే దర్శకుల నెంబర్లు కూడా నా దగ్గర ఉండవు. కొరటాల శివ ఇంకా సుకుమార్ ఫోన్ నెంబర్ లు నా దగ్గర లేవు. ఇదేవిధంగా రాజమౌళి గారి నెంబర్ కూడా నా దగ్గర లేదు. ప్రస్తుతం నా ప్రయాణంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. త్రివిక్రమ్ గారితో పనిచేస్తున్నాను. నా టీం ఎంతో సహకరిస్తూ ఉంది అంటూ తమన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో ప్రపంచంలోనే టాప్ మోస్ట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ఫోన్ నెంబర్ తన దగ్గర లేదని తమన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొద్దిగా కాంట్రవర్సీగా మారాయి.