Taraka Ratna: నందమూరి తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, నందమూరి, నారా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. సరిగ్గా మూడు వారాల కిందట నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు. దాంతో గుండెపోటు వచ్చింది. ఇక వెంటనే ప్రాథమిక చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు. తరువాత కుప్పంలోని ప్రముఖ పీఈఎస్‌కు తరలించారు. ఆరోగ్యం మెరుగుకాకపోవడంతో అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్య నిపుణులు 23 రోజుల పాటు తారకరత్న ను యదావిధిగా తీసుకు రావడానికి ప్రయత్నించినా.. ఆ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చికిత్స పొందుతూ తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

తారక రత్న రాజకీయాల్లోకి రావాలని ఆ మధ్య చాలా ప్రాంతాల్లో తన అభిమానులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి తిరిగారు. ఓ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీచేయాలని తారకరత్న అనుకున్నారాని తెలుస్తోంది. తారకరత్న ఎక్కడ్నుంచి పోటీ చేయాలనుకున్నారు..? ఈ విషయం ఎవరెవరికి చెప్పారు..? వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఈ నియోజకవర్గంలోనెనా.!
కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గమైన గుడివాడ నుంచి తారకరత్న పోటీచేయాలని బలంగానే ప్రయత్నాలు చేశారని గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్‌కు కూడా చెప్పారట. వారు కూడా సరే అన్నారని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. నిజానికి ఒకప్పుడు గుడివాడ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట.. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కొడాలి నాని అడ్డాగా మారిపోయింది. చీటికి మాటికి టీడీపీపై నోరుపారేసుకునే నానిపై నందమూరి ఫ్యామిలీ నుంచి ఒకర్ని బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం గట్టి ప్లాన్‌తోనే ఉందని తెలుస్తోంది. ఇక అప్పుడే తారకరత్న కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తా అనడం.. పోటీ కూడా చేస్తాననడంతో గుడివాడ నుంచే బరిలోకి దింపాలని ప్లాన్ చేసిందట అధిష్టానం. ఒకవేళ తారకరత్నే గుడివాడ నుంచి పోటీచేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అనడంలో అతిశయోక్తి లేదు.
వరుస సమావేశాలు..
ఆ మధ్య లోకేష్‌తో తారకరత్న భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి భేటీ ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే జరిగింది. పోటీచేసే స్థానంపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. దానికి తోడు తనకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందని తారకరత్న ఓ సందర్భంలో చెప్పడంతో.. ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరినట్లయ్యింది. తారకరత్న టీడీపీ తరపున గత ఎన్నికల్లో కూడా ప్రచారం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ అనుభవం కూడా ఎన్నికల్లో పోటీచేయడానికి పనికొస్తుందని టీడీపీ అభిమానులు అనుకున్నారు.
తారకరత్న అప్పట్లో ఎన్నికల్లో పోటీ, వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలే చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాను. ప్రస్తుతం ఏపీ సంక్షోభంలో ఉంది. దాని నుంచి బయటపడాలంటే టీడీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యం అవుతుంది. ప్రజల కష్టాలు తీర్చేందుకు ప్రత్యక్షంగా రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధమయ్యానని తెలిపారు. నా అడుగు ప్రజల వైపు… నా చూపు రాష్ట్రాభివృద్ధి. అదే లక్ష్యంతో పనిచేస్తా. సుపరిపాలన అందించే నాయకుడు చంద్రబాబు. రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి అండగా ఉండాలి. టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు నేను ఇప్పటి నుంచే అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని చెప్పారు. బాలయ్య బాబాయ్ ఆశయాలకు అనుగుణంగా నేను నడుచుకుంటాను. సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అని తారకరత్న చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రులో టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తారకరత్న ఈ విషయాలు వెల్లడించారు. ఆయన ఎమ్మెల్యే గా పోటీ చేయకుండానే ఆయన ఆఖరి కోరిక తీరకుండానే తారకరత్న అనంత లోకాలకు వెళ్లిపోయారు..