ఆ సినిమా నుంచి తప్పుకున్న స్టార్ డైరెక్టర్!

శంక‌ర్‌.. భారతీయ సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మ‌క్క‌ర‌లేని పేరు. ఎందుకంటే త‌న‌దైన స్టైల్‌లో సినిమాలను తెర‌కెక్కించి.. అగ్ర‌ ద‌ర్శ‌కుడిగా పేరు సంపాదించుకున్నారు. కేవ‌లం వినోదాన్ని అందించే సినిమాలే కాకుండా స‌మాజానికి మంచి సందేశం అందించే చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో శంక‌ర్ గొప్ప‌త‌నం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎందుకంటే గ‌తంలో ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఒకే ఒక్క‌డు, భార‌తీయుడు, అప‌రిచితుడు, శివాజీ చిత్రాలే అందుకు నిద‌ర్శ‌నం.

మ‌రో వైపు ఇండియ‌న్ సినీ చరిత్ర‌లో తనదైన నటనతో చెర‌గ‌ని ముద్ర‌వేసి.. అగ్ర‌క‌థానాయ‌కుడిగా పేరు సంపాదించుకున్నారు ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌. ఇప్ప‌టికే ఆయ‌న సినిమాలు విడుద‌ల అయితే, చాలు బాక్సాఫీస్ రికార్డులు బద్ద‌ల‌వాల్సిందే. అయితే, ఒక‌వైపు రాజ‌కీయ కార్య క్ర‌మాలు కొన‌సాగిస్తూనే సినిమాల్లోనూ న‌టిస్తున్నారు క‌మ‌ల్‌.

అయితే, త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇద్ద‌రు సినీ దిగ్గజాలు క‌లిసి 1996లో “భార‌తీయుడు” సినిమాను తీసి భార‌తీయ సిల్వ‌ర్ స్క్రీన్‌ను షేక్ చేశారు. అప్ప‌ట్లో భార‌తీయుడు సినిమా ఒక సంచ‌ల‌నం. క‌ర‌ప్ష‌న్ ఇతివృత్తంగా తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు బ్రేక్ చేసింది. శంక‌ర్, క‌మ‌ల్ ల‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చిన ఈ సినిమా సీక్వెల్ “భార‌తీయుడు-2″ను తీస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే, చాలా కాలం త‌ర్వత వీరిద్ద‌రి కాంభినేష‌న్‌లో భార‌తీయుడు-2 వ‌స్తుండ‌టంలో భారీగా అంచ‌నాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమాకు మొదటి నుంచి ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి. సినిమా స్టార్ట్ అయిన మొద‌ట్లోనే ద‌ర్శ‌కుడు శంక‌ర్‌కు, నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్‌కు మ‌ధ్య విభేదాల కార‌ణంగా మొద‌ట్లోనే ఆగిపోయింది. మ‌ళ్లీ కొన్ని రోజుల త‌ర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభ‌మైంది. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గా ప్ర‌మాదం జ‌రిగి మ‌ళ్లీ నిలిచిపోయింది. అంత‌లోనే క‌రోనా రావ‌డంతో ఆ ప్ర‌భావం సినిమాపై ప‌డింది.

ఈ నేప‌థ్యంలోనే నిర్మాణ సంస్థ భార‌తీయుడు-2 బ‌డ్జెట్‌ను త‌గ్గించుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని టాక్‌. అయితే, దీనికి డైరెక్ట‌ర్ శంక‌ర్ స‌సేమీరా అంటున్నార‌టా ! దీంతో తిరిగి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం గురించి నిర్మాణ సంస్థ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని స‌మాచారం. దీనిపై ఇప్ప‌టికే లైకా ప్రొడ‌క్ష‌న్‌కు శంక‌ర్ లేఖ రాసిన‌ట్టు తెలిసింది. ఇన్ని ఇబ్బందుల మ‌ధ్య ఈ సినిమా కోసం కొన‌సాగ‌డం అవ‌స‌ర‌మా? అనుకుంటున్నార‌ట. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మ‌రో ప్రాజెక్టుపై దృష్టి సారించార‌ని సినీ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. ఇదే గ‌న‌క నిజ‌మైతే అప్ప‌ట్లో సంచ‌‌ల‌నం సృష్టించిన భార‌తీయుడు సీక్వెల్ అట‌కెక్క‌డం ఖాయంగానే తెలుస్తోంది. ఇలా జ‌రిగితే.. ఈ సినిమా ఇక రావ‌డం క‌ష్ట‌మే !