Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఈ రోజు వెరీ వెర్రీ స్పెషల్. ఎందుకో తెలుసా.. ఈయన నటించిన `బన్నీ` చిత్రం 17 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు విడుదలైంది. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సిరి వెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.సత్యనారాయణ రెడ్డి నిర్మించారు. ఇందులో బన్నీకు జోడీగా గౌరి ముంజల్ నటించింది.
ప్రకాశ్ రాజ్, ఎం. ఎస్. నారాయణ, రఘుబాబు, వేణుమాధవ్ తదితరులు కీలక పాత్రలను పోషించగా.. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. వేసవి కానుకగా 2005 ఏప్రిల్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేయగా.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా రూ. 12 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. లాంగ్ రన్లో బాక్సాఫీస్ వద్ద రూ. 15 కోట్ల షేర్ వసూల్ చేసి నిర్మాతలకు మూడు కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టింది. అంతేకాదు, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో.. కెరీర్ స్టార్టింగ్‌లోనే బన్నీ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న హీరోగా రికార్డు సృష్టించారు.
కాగా, బన్నీ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలె `పుష్ప ది రైజ్` మూవీతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించాడు. టాక్ ఎలా ఉన్నా ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టి క్లీన్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా పార్ట్ 2 `పుష్ప ది రూల్` రాబోతోంది. త్వరలోనూ ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది.