Tollywood: టాలీవుడ్ Tollywood జులాయి సినిమాలో బన్నీ ‘నేను ఆడి ఫ్యాన్.. ఆడెప్పుడూ టాప్ లోనే ఉండాలి’ అంటాడు. మన హీరోలపై పెంచుకున్న అభిమానానికి త్రివిక్రమ్ రాసిన డైలాగ్ ఓ ఉదాహరణ. హీరో ఆరాధనే కాదు.. బిరుదులు కూడా ముఖ్యమే. దక్షిణాది సినీ పరిశ్రమలో మరీ ముఖ్యంగా తెలుగు, తమిళ్ లో ఈ పద్ధతి ఎక్కువగా ఉంటుంది. మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్,.. ఇలాంటి పేర్లతో మన హీరోలను పిలుచుకుంటాం. పలువురు హీరోలకు తొలినాళ్లలో ఉండే బిరుదులు తర్వాత కాలంలో వారి స్టార్ డమ్, వయసును బట్టి మార్చుకుంటూ ఉంటారు. ఈక్రమంలో ఇలా బిరుదులు మారిన హీరోల లిస్టును పరిశీలిస్తే..
కృష్ణకు తొలిగా ‘నటశేఖర’ అనే బిరుదు ఉండేది. అయితే.. మాస్ హీరోగా కృష్ణ వెలిగిపోతున్న రోజుల్లో ప్రముఖ సినీ వారపత్రిక ‘సూపర్ స్టార్’ అనే బిరుదు తెలుగు హీరోల్లో ఎవరికి ఇవ్వాలనే కాంటెస్ట్ పెట్టింది. వేల సంఖ్యలో ‘కృష్ణ’కు మద్దతుగా ఓట్లు పడటంతో నటశేఖర కృష్ణ.. సూపర్ స్టార్ కృష్ణ అయ్యారు. డ్యాన్సులు, ఫైట్లతో తెలుగు సినిమాల్లో పెను మార్పులు తీసుకొచ్చిన చిరంజీవికి తొలినాళ్లలో డైనమిక్ హీరో బిరుదు ఉండేది. ఆ తర్వాత సుప్రీమ్ హీరోతో పాపులర్ అయ్యారు. మరణమృదంగం సినిమాలో తొలిసారి మెగాస్టార్ బిరుదును టైటిల్స్ లో వేశారు. ఎనలేని స్టార్ డమ్ తో చిరంజీవికి ఆ బిరుదు స్థిరపడిపోయింది.
బాలకృష్ణ యువరత్న నుంచి నట సింహం అయ్యారు. నాగార్జున యువ సామ్రాట్ నుంచి కింగ్ వచ్చింది. మహేశ్ ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ అయ్యారు. ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ నుంచి రెబల్ స్టార్ గా మారింది. రవితేజకు మాస్ హీరో నుంచి మాస్ మహారాజ్ వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది. కెరీర్ మొదటి నుంచీ స్టైలిష్ స్టార్ గా ఉన్న బన్నీ ఇప్పుడు ‘ఐకాన్ స్టార్’ అయ్యాడు. నిన్న రిలీజ్ చేసిన పుష్ప టీజర్ లో ‘ఐకాన్ స్టార్’ అని అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. హీరో వర్షిప్ కు, క్రేజ్ కు ఈ బిరుదులు కొలమానంగా నిలుస్తాయి.