Pawan Trivikram: తెలుగు చలనచిత్ర రంగంలో పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా పవన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వసూలు చేస్తాయి. పవన్ కి అత్యంత సన్నిహితుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇద్దరి మధ్య దాపరికాలు లేని స్నేహం ఉంది. త్రివిక్రమ్ తనకి స్నేహితుడు మాత్రమే కాదు గురువు లాంటి వారిని కూడా ఇటీవల బాలకృష్ణ షోలో పవన్ తెలియజేశారు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ భార్య సౌజన్య శ్రీనివాస్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. త్రివిక్రమ్ మరియు పవన్ బంధం పై కీలక వ్యాఖ్యలు చేశారు.
మావారు కళ్యాణ్ గారు ఇద్దరు మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ కలిశారంటే బయట ప్రపంచం గురించి అస్సలు పట్టించుకోరు. ఎక్కువ తత్వశాస్త్రం మరియు పురాణాల గురించి చర్చించుకుంటారు. ఇంకా కళ్యాణ్ గారికి మా ఇంటి వంట అంటే చాలా ఇష్టం. ఉదయం పూట వస్తే అడిగి మరి ఉప్మా చేయించుకుంటారు. మధ్యాహ్నం భోజనం లోకి ఆవకాయి వెజిటేరియన్ వంటకాలు ఇష్టంగా చేయించుకుని తింటారు. అసలు సిగ్గుపడరు ఇంట్లో మనిషిలా కలిసిపోతారు. ఊరగాయ ఇంకా రవ్వ.. లడ్డులు అడిగి మరీ తింటారు. వాళ్ళిద్దరి స్నేహం చాలా గొప్పది ఒక్కరంటే మరొకరికి చాలా గౌరవం. ఎవరికీ సొంత పుస్తకాలు ఇవ్వని త్రివిక్రమ్.. పవన్‌గారు అడిగితే మాత్రం కాదనరు. వాళ్లిద్దరూ ఇచ్చిపుచ్చుకునే బహుమతులు పుస్తకాలు, పెన్నులే.. అని తెలియజేయడం జరిగింది.
అదేవిధంగా తనపై కూడా త్రివిక్రమ్ ప్రభావం ఎక్కువ అని సౌజన్య శ్రీనివాస్ పేర్కొన్నారు. చిన్న వయసులోనే మా పెండ్లయింది. నాకు ఏం కావాలన్నా మా వారే చూసుకునేవారు. ‘ఇదిలా చేస్తే బాగుంటుంది..’ అని ప్రతి విషయం నాకు తెలిసేలా చెబుతుంటారు. ప్రతిక్షణం నన్ను గైడ్ చేస్తారు. పుస్తకాలు పరిచయం చేసింది కూడా ఆయనే. పుస్తక పఠనం అలవాటు నాలో అనేక మార్పులు తీసుకొచ్చింది అని సౌజన్య శ్రీనివాస్.. అనేక విషయాలు తెలియజేయడం జరిగింది.