పవర్ స్టార్ డైలాగులకు మాత్రమే కాదు.. ఆయన సినిమాలకు కూడా ఒక లెక్కుంటుంది. అందుకే సినీ అభిమానులు ఆయన సినిమా రాబోతుంది అంటే చాలు ఎగబడతారు. అలా పలు అంచనాల మధ్య రాబోతున్న చిత్రమే.. వకీల్ సాబ్. ఈ సినిమాలోని మగువా.. మగువా అనే పాట ఎంత క్రేజ్ ను సంపాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేటికీ ట్రెండింగ్ సాంగ్ లిస్ట్ లో ఆ పాట నిలిచే ఉంది అంటే ఒకటి ఆ పాట గొప్పతనం. ఇంకోటి పవర్ స్టార్ సినిమాలోనిది కావడం.
వకీల్ సాబ్ సినిమా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుంది అని పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎంతో శ్రద్ధగా చదువుతున్నారు. ఈ సమయంలో వకీల్ సాబ్ చిత్ర యూనిట్ పవన్ అభిమానులకు తీపి కబురు చెప్పబోతుంది. ఈ సంక్రాంతికి పవన్ తన అభిమానులకు ఇచ్చే కానుక అంటూ పలువురు చెప్పుకుంటున్నారు.
జనవరి 14 సంక్రాంతి పండగ సందర్భంగా సాయంత్రం 6.03 గంటలకు వకీల్ సాబ్ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దానికి సంబంధించిన పోస్టర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. దాంతో పవన్ అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. ఎప్పుడెప్పుడు టీజర్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వకీల్ సాబ్ రాబోతున్నాడు అంటూ వాట్సాప్ లో స్టేటస్ లు పెట్టుకుంటూ తెగ సంబుర పడిపోతున్నారు.
డిసెంబర్ 31న విడుదల చేసిన పోస్టర్ లో పవన్ రాయల్ ఎన్ ఫీల్డ్ నడుపుతుంటే.. హీరోయిన్ శృతి హాసన్ నవుతూ కనిపించింది. ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే పవన్, శృతిల మధ్య మంచి రొమాంటిక్ సీన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జోడీ మరోసారి హిట్ కొట్టడం కాయమని సినీ వర్గాలు అంటున్నాయి.