తెలుగు సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ జనరేషన్ తర్వాత చిరంజీవి శకం ప్రారంభమైంది. ఈ జనరేషన్ లో స్టార్ హీరోగా ఎదిగినవారిలో వెంకటేశ్ ఒకరు. వెంకటేశ్ కు శ్రీనివాస కల్యాణం, రక్తతిలకం, బ్రహ్మపుత్రుడు, స్వర్ణకమలం, వారసుడొచ్చాడు, ప్రేమ.. సినిమాలతో వరుస హిట్లు పడ్డాయి. వరుస విజయాలు వెంకటేశ్ ను సక్సెస్ ఫుల్ హీరోగా మార్చినా.. ఆయన కెరీర్ ను అమాంతం తారాజువ్వలా పైకి తీసుకెళ్లిన సినిమా మాత్రం ‘బొబ్బిలి రాజా’. వెంకటేశ్ ను ఒక్కసారిగా కమర్షియల్ హీరోగా మార్చేసిన ఈ సినిమా అది. వెంకటేశ్ ను విక్టరీ వెంకటేశ్ గా మార్చేసిన ఈ సినిమా విడుదలై నేటితో 30 ఏళ్లు పూర్తయ్యాయి.
వెంకటేశ్ కెరీర్ లో తొలి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకుడు. 1990 సెప్టెంబర్ 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాను సృష్టించింది. వెంకటేశ్ విభిన్నమైన నటన, డైలాగ్స్, మేనరిజమ్స్.. మాస్ ఆడియన్స్ కు దగ్గర చేసింది. పరుచూరి బ్రదర్స్ రాసిన రివేంజ్ డ్రామాలో అత్త-అల్లుళ్ల హిట్ ఫార్ములాను యాడ్ చేశారు వాణిశ్రీ, వెంకటేశ్ పోటీ పడి నటించి ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించారు. అడవి నేపథ్యం.. జంతువులను చూపించడం.. అడవి అందాలకు చిన్న పిల్లలు మురిసిపోయారు. సినిమా ఆద్యంతం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడంతో తిరుగులేని విజయం సాధించింది.
దివ్యభారతికి తెలుగులో ఇదే తొలి సినిమా. ఆమె అందం సినిమాకు ఎస్సెట్. ఈ సినిమాతో ఏకంగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ‘బొబ్బిలి నడిబొడ్డులో.. అంటూ వెంకటేశ్, రాష్ట్రాన్నైనా రాసిస్తాను కానీ.. నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయను’ అంటూ వాణిశ్రీ డైలాగులు ధియేటర్ల మోత మోగించాయి. ‘అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో..’ అనే వెంకటేశ్ మ్యానరిజమ్ వెంకటేశ్ కు బ్రాండ్ డైలాగ్ గా మిగిలిపోయింది. ఇళయరాజా సంగీతంలోని పాటలన్నీ సూపర్ హిట్టే. ఇప్పటికీ పాటలు చార్ట్ బస్టర్స్ అని చెప్పాలి. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ వాల్యూని మరింత పెంచిందీ సినిమా. బి.గోపాల్ దర్శకత్వ ప్రతిభ సినిమాను విజయ తీరాలకు చేర్చింది. 43 సెంటర్లలో 100 రోజులతోపాటు కొన్ని సెంటర్లలో 200 రోజులు ఆడింది. ద్విశతదినోత్స వేడుకలను హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు.