రంగస్థలం సినిమాతో మంచి ఊపుమీదున్న చరణ్ కి… ఊరమాస్ నే ఇంటిపేరుగా మారుగా మార్చుకున్న బోయపాటి శ్రీను లాంటి డైరెక్టర్ తగిలితే ఎలా ఉంటుందో వినయ విధేయ రామ పోస్టర్స్ తోనే చూపించారు. టీజర్ తో అంచనాలని అమాంతం పెంచిన ఈ ఇద్దరు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చారు. మరి ఈ భారీ హైప్ ని వినయ విధేయ రామ సినిమా అందుకుందో లేదో చూద్దాం.
అనాథగా రోడ్డు పక్కన చనిపోయే పరిస్థితి నుంచి కాపాడిన రామకు తన నలుగురు అన్నలన్నా, వదినాలన్నా ప్రాణం. వీరిలో ఇంటికి పెద్దవాడైన భువన్ కుమార్ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ ఆఫీసర్ గా వైజాగ్ కి వెళ్తాడు. అక్కడ రౌడీ అయినా పందెం పరశురాంతో గొడవ జరుగుతుంది, తన అన్నలని ఒక్క మాట కూడా పడనివ్వని రామ్.. పందెం పరశురామ్ ని కొట్టి భయపెడతాడు. ఇలా ఎక్కడ హింసాత్మక ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నా స్పెషల్ ఆఫీసర్ గా వెళ్లే భువన్ కుమార్ ఈసారి ఎలెక్షన్స్ ని సజావుగా సాగించడానికి బీహార్ వెళ్తాడు, కానీ అప్పటికే ఆ ప్రాంతం రాజు భాయ్ చేతిలో ఉంటుంది. క్రూరత్వానికి పరాకాష్ట అయిన రాజు భాయ్, భువన్ కుమార్ ని లేనట్టి ఇబ్బందులు పెట్టాడు, వీటి నుంచి రామ్ తన అన్నని కాపాడుకున్నాడా లేదా అనేదే ఈ వినయ విధేయ రామ కథా కథనం.
భారీ ఫైట్ తో ఓపెన్ అయిన ఈ సినిమా మొదటి అరగంట చాలా బాగుంటుంది కానీ ఆ తర్వాతే అసలు ఎవరు ఎందుకు వస్తున్నారు? ఏం చేస్తున్నారు అనేది కూడా అర్ధం కాదు. సడన్ గా సీన్స్ మధ్యలో పాటలొస్తాయి, కట్ చేస్తే ఎక్కడో ఒక ఫైట్ సీన్ వస్తుంది. ఈ డైలమాలో ఉండగా ఒక పెద్ద ఫైట్ తో, ఆశ్చర్యపరచని ఒక చప్పటి ఫైట్ సీన్ తో ఇంటర్వెల్ వస్తుంది. కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఫస్ట్ హాఫ్ పర్వాలేదని పిస్తుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం ప్రతి ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. రెండో భాగం మొదటి సీన్ తోనే ఏం జరిగిందో అర్థమై పోవడంతో సినిమా ఆసక్తిగా అనిపించదు. ఫైట్స్ ఉన్నాయి కానీ ఊహించిన రేంజులో లేవు, సాంగ్స్ ఉన్నాయి కానీ వినేలా లేవు, సెంటిమెంట్ ఉంది కానీ కనెక్ట్ అవ్వదు, కామెడీ ఉంది కానీ నవ్వు రాదు… ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో ప్రతి ఎమోషన్ ఉంది కానీ ఏది మెప్పించదు.
రామ్ కొణిదెలగా కనిపించిన చరణ్, తనకి ఇచ్చిన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు.. డాన్స్, ఫైట్లు, డైలాగులతో మెప్పించాడు. చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి వినయ విధేయ రామ సినిమా ఒక బెస్ట్ ఉదాహరణ. పసలేని కథని చరణ్ ఒక్కడే ఈ సినిమాని తన భుజాలపై మోస్తూ ముందుండి నడిపించాడు. చరణ్ తర్వాత చెప్పుకోవాల్సిన పాత్ర ఏదైనా ఉందా అంటే అది తప్పకుండా వీవీకే ఒబెరాయ్ గురించే, విలన్ పాత్రలో అతను అద్భుతంగా నటించాడు. స్క్రీన్ పై విలనిజం పండించిన తీరు చూస్తే టాలీవుడ్ కి ఒక మంచి విలన్ దొరికినట్లు అయ్యింది. మిగిలిన పాత్రల్లో కనిపించిన వారిలో స్నేహ, ప్రశాంత్ బాగా నటించి వారి పాత్రలకి పూర్తిగా న్యాయం చేశారు. ఇక మొదటి సినిమాతోనే మెప్పించిన కియారా అద్వానీ తెరపై అందంగా కనిపించింది కానీ నటించడానికి ఏమీ లేదు, పాటల కోసమే హీరోయిన్ అన్నట్లుగా అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం పనితనం గురించి మాట్లాడాలంటే మ్యూజిక్ దగ్గర మొదలుపెడితే, కెమెరామ్యాన్, స్టంట్ మ్యాన్స్, డాన్స్ మాస్టర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే డైరెక్టర్ వరకూ ఎవరూ ఈ వినయ విధేయ రామ సినిమాకి న్యాయం చేయలేదు. ఎవరిపాటికి వాళ్లు మంచి ఔట్పుట్ ఇచ్చినా కూడా సినిమాని నిలబెట్టే స్థాయిలో అందరూ కలిసి పనిచేయలేదు.ఇక 24 క్రాఫ్ట్స్ తో పని చేయించుకోవాల్సిన బోయపాటి శ్రీను, చరణ్ లాంటి హీరో దొరికితే చెలరేగిపోతాడు అనుకుంటే చప్పగా తీశాడు. వినయ విధేయ రామ అనే టైటిల్ కాకుండా విధ్వంస రామ అని పెట్టుకొని ఉంటె బాగుండేది, ఎప్పుడు బోయపాటి బలంగా చెప్పుకునే యాక్షన్ ఎపిసోడ్స్ ఏ ఈ సినిమాకి మైనస్ గా మారాయి. కథలో దమ్ములేకపోవడంతో సినిమాని లేపవడానికి, హీరోయిజం ఎలివేట్ చేయడానికి ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. మొత్తానికి భారీ హిట్ అవుతుంది అనుకున్న వినయ విధేయ రామ సినిమా నిరాశపరిచింది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!