మొండి గుండెలు కరిగేలా…! మొండి గోడలు పగిలేలా…!

24 Mar, 2020 - 04:44 PM

మనసు ముక్కలయ్యే కథలున్నాయ్…!
కళ్ళు చెమ్మగిల్లే చిత్రాలున్నాయ్…!
గుండె బరువెక్కే సన్నివేశాలున్నాయ్…!
అమ్మలుగా అర్ధాంతరంగా ముగిసిన పాత్రలున్నాయ్..!
చిన్నారిగా అర అడుగులోనే ఆగిన శ్వాసలున్నాయ్…!
అన్నిటినీ కోల్పోతున్న బంధాలున్నాయ్…!
బంధాలు మిగిల్చిన కన్నీటి ధారలున్నాయ్…!
ధారలు మిగిల్చిన కంటి చారికలున్నాయ్…!
చారికలు మాటున గుండె తరుక్కుమనే గాధలున్నాయ్…!

  • చైనాలోని వూహాన్ నగరం. ఓ తొమ్మిది నెలల చిన్నారి. అమ్మ పొత్తిళ్లలో పాలు తాగాల్సిన వయసు. నాన్న గుండెలపై నడవాల్సిన వయసు. కానీ ఆ అమ్మ, నాన్నకి అందకుండా.., అసలు వారి నీడ కూడా పడకుండా ఆసుపత్రి పాలయ్యింది. కరోనతో ఆసుపత్రిలో చికిత్స పొందింది. చుట్టూ అద్దాల షో కేస్. ముక్కు, నోట్లో ఆక్సిజన్ పైపులు… అప్పుడప్పుడూ చుట్టూ కప్పుకున్న నర్సులు, డాక్టర్లు వచ్చి చూసి వెళ్తున్నారు. ఏడ్చినా ఓదార్చే వారు లేరు. ఆకలి తీర్చేవారు లేరు. తనకు ఏమయిందో తెలీదు. ఏం చేస్తున్నారో తెలీదు. పాపం ఆ చిన్నారి ఏడుపు చూసి, విని వైద్యం చేసే వైద్యుడే కన్నీరుమున్నీరై విలపించాడు. (ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. చూసే వారికి కన్నీరు ఆగలేదు) చివరికి ఆ చిన్నారి కన్నుమూసింది. కడచూపు, బుగ్గి కూడా ఆ తల్లిదండ్రులకు దక్కలేదు.
  • చైనాలో ఓ నగరం. ఓ కుటుంబంలో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తెకి కరోనా సోకింది. ఆసుపత్రికి తీసుకెళ్తే మళ్ళీ నయమవుతుందో లేదో తెలియదు. బతుకుతుందో లేదో తెలీదు. తిరిగి ఆమె వస్తుందో లేదో తెలియదు. చివరి చూపు కూడా ఉండదేమో అనే ఆవేదన మధ్య… అందుకే చావయినా, బతుకైనా అందరూ కలిసి అనుకున్నారు. ఆ కుటుంబమంతా ఊరు విడిచి వెళ్లిపోడానికి సిద్ధ పడ్డారు. ఒక్క కుటుంబం… కానీ వందలాది పోలీసులు, తుపాకులు, లాఠీలు, జల్లెడలు.. ఇంకేముంది బంధించి తీసుకెళ్లారు. (ఆ కుటుంబాన్ని పోలీసులు తరుముతున్న వీడియో సోషల్ మీడియాలో వచ్చింది. చాలా మందికి హృద్యం ద్రవించింది).
  • ఓ తల్లి. ఏడు నెలల కిందట అమ్మయ్యింది. రోజు బిడ్డను చూస్తూ బతికేస్తుంది. నవ్వులకు అడ్డు లేదనుకుంది. ఆ అమ్మతనం పూర్తిగా ఆస్వాదించకముందే మహమ్మారి సోకింది. ఆసుపత్రి పాలయ్యింది. బిడ్డను చూడకూడదు. తాకాకూడదు. అసలు ఆ అమ్మ నీడ బిడ్డకు చేరకూడదు. ఆ తల్లి తల్లడిల్లింది. ఆ కష్టం ఏ తల్లికి రాకూడదు. ఆసుపత్రిలో పోయించి, పోరాడి ఒక్కసారి తన బిడ్డను మనసారా ఎత్తుకుంటా అంటూ తెచ్చుకుంది. దేహం మొత్తం పరదా, కవర్ కప్పుకుని బిడ్డను ఎత్తుకుని ఏడ్చింది. ఈ దృశ్యం చూసిన వారికి గుండె బరువెక్కింది.
  • ఇవన్నీ రోగుల బాధలు. మరి… వైద్యులకూ కష్టాలున్నాయి. నిద్రాహారాలు లేవు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా పడుకుంటున్నారో, ఏం తింటున్నారో తెలియకుండా గడుపుతున్నారు. మాస్కులు పట్టుకుని, కట్టుకుని, పెట్టుకుని మొహం మారుతుంది. తమ అనే పట్టింపు లేదు. కుటుంబం అనే ధ్యాస లేదు. వైద్యం చేస్తూనే కొందరు మరణిస్తున్నారు. చావుకు వైద్యం చేస్తూ చస్తున్నారు కొందరు వైద్యులు. అదీ ఆ వృత్తి ధర్మం…!

కరోనా వచ్చింది. మనతోనే ఉంది. కొన్నాళ్ళు ఉంటుంది. పోతుందో లేదో తెలియదు కానీ… మానవాళికి కొత్త బంధాలను గుర్తు చేస్తుంది. మనిషికి మనిషి తత్వం నేర్పుతుంది. ఇన్నాళ్ళు డబ్బు, కులం, మతం, సంఘం, అహం, జాతి అంటూ విర్రవీగిన మానవాళికి ఒక చిన్న సూక్ష్మ వైరస్ చావుని చూపిస్తుంది. కోట్లాది మందికి చావు భయం చూపిస్తుంది. బేధాలు లేకుండా సోకుతుంది. సాకుతుంది. సర్వ సమానత్వం చాటుతుంది. మీరు మనుషులే, మీరంతా మనుషులే వైరస్ అనే జీవి ముందు మీరంతా ఒక్కటే, చిన్నబోవడమే అనే పాఠాన్ని నేర్పుతుంది. అన్నిటికీ మించి గుండెలను బరువెక్కిస్తుంది. ఏ తక్కెడకు తూగని కన్నీటిని పంచుతుంది. దేశాల హద్దులను చేరిపేసి… రోగం వస్తే అందరికీ కన్నీరొక్కటే అనే నానుడిని చాటుతుంది…! చాలు కరోనా.. పాఠాలు నేర్చుకున్నాం, కలిసి పోరాటం నేర్చుకున్నాం, ఉంటే తింటాం, లేకపోతే పస్తులుంటాం… అంబానిని ఏమి చేయకు, అడుక్కున్నోడినీ ఏమి చేయకు. చాలు కరోనా, చాలు…! – శ్రీనివాస్ మానెం