Navagrahalu జాతకపరంగా చూసుకున్నప్పుడు నవగ్రహలు వాటి స్థానాలు మారడం వలన మనకు శుభ, అశుభఫలితాలు వస్తుంటాయి అని జ్యోతిష్య శాస్త్రం తెలియచేస్తుంది. గ్రహాధిపత్యం వలన కలిగే అశుభ ఫలితాలనుండి తప్పుకునేందుకు నవగ్రహ ఆరాధన చేయడం ఉత్తమం అని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తున్నారు.
కాబట్టి నవగ్రహ పూజలో దీపారాధనకు వాడాల్సిన వత్తులు, దీపారాధనలో ఎలాంటి నూనెలు వాడాలి అనేది తెలుసుకుందాం…
1.సూర్యారాధన చేసేటప్పుడు కుంకుమ రంగు ఏకవత్తిని తీసుకుని ఎర్రరంగు ప్రమిదెలో వేసి అందులో ఆవు నెయ్యని పోసి దీపం వెలిగించాలి. .
2. చంద్ర గ్రహ పూజ చేసుకోవడానికి ఏకినటువంటి దూదితో తయారు చేయబడిన రెండు వత్తులను వెండి ప్రమిదెలో వేసి అందులో ఆవు నేతిని పోసి దీపం వెలిగించాలి .
3.కుజ గ్రహ పూజ చేసుకోవడానికి కుంకుమ రంగు లో ఉన్న మూడు వత్తులను తీసుకుని ఎర్రటి ప్రమిదెలలో వేసి అందులో నువ్వుల నూనెను పోసి దీపం వెలిగించు కోవాలి.
4.బుధ గ్రహ పూజ చేసుకోవడానికి తెల్లజిల్లేడు వత్తులను నాలుగు తీసుకుని ఎర్రటి ప్రమిదెలో వేసి అందులోనే ఒక తమలపాకు కూడా వేసి కొబ్బరి నూనె పోసి దీపం వెలిగించాలి.
5. గురుగ్రహ పూజ చేసుకోవడానికి తామర తాడుతో తయారు చేయబడిన ఐదు వత్తులను తీసుకుని ,కంచు ప్రమిదెలలో వేసి నేయి పోసి వెలిగించాలి.
6.శుక్ర గ్రహ పూజ చేయడానికి తామర తూడు తో తయారు చేయబడిన ఆరు వత్తులను ప్రమిదెలో వేసి,అందులో ఆవునేతిని పోసి దీపాన్ని వెలిగించాలి.
7.శని గ్రహ పూజ చేయడానికి నల్లని ఏడు వత్తులను తీసుకుని, స్టీలు ప్రమిదెలో వేసి అందులో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి.
8. రాహు గ్రహ పూజ చేయడానికి నలుపు రంగు లో ఉన్న
ఎనిమిది వత్తులను తీసుకుని నిమ్మకాయ డొప్పలో వేసి అందులో అష్టమూలికా తైలాన్ని పోసి దీపం వెలిగించుకోవాలి.
9.కేతు గ్రహ పూజ కోసం తెల్లజిల్లేడుతో చేసిన తొమ్మిది వత్తులను తీసుకుని ప్రమిదెలో వేసి అందులో కొబ్బరి నూనె పోసి దీపం వెలిగించాలి.