శ్రీవారి స్వామిపుష్కరిణి విశేషాలు ఇవే !

తిరుమలలో ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. స్వామి వారికి ఆశ్వీయుజమాసంతో అవినాభావ సంబంధం. ఈ కాలంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారిని తలచిన, స్వామివారి కొండ విశేషాలు, పూజలు,కైంకర్యాలు స్వామివారి భక్తుల కథలు తెలుసుకున్నాస్వామి అనుగ్రహం శ్రీఘ్రంగా లభిస్తుందని పురాణాలో ఉంది. ఈరోజు స్వామి పుష్కరిణి గురించి తెలుసుకుందాం…

తిరుమల కొండపైన ఉన్న పుష్కరిణి మానవనిర్మితం కాదు. అది స్వయంవ్యక్త క్షేత్రం కనుక పుష్కరిణి కూడ స్వయంవ్యక్తమైనది. “స్వామి పుష్కరిణి” అనే ప్రసిద్ధి, వెంకటాద్రియందున్న మూడుకోట్ల తీర్ధాలలో. ఈ ఒక్క తీర్ధానికే దక్కింది. ఈ పుష్కరిణి గురించి వరాహ, పద్మ, మార్కండేయ, వామన, స్కాంద, బ్రహ్మ, భవిష్యోత్తర పురాణాలు పేర్కొన్నాయి. శ్వేతవరాహ రూపంలో ఉన్న విష్ణువు ఆఙ్ఞానుసారం గరుడుడు, వైకుంఠము నుండి “క్రీడావాపిని” భూలోకానికి తెచ్చెను. ఇది గంగాది తీర్ధాలకు ఉత్పత్తిస్థానమని శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలియకముందే స్వామి పుష్కరిణి ఆవిర్భవించింది అని వరాహపురాణం ప్రతిపాదిస్తున్నది. దీన్ని గురించిన ప్రస్తావన అంటే ఎప్పుడు/ఎలాగ ఆవిర్భవించింది అనే దాని గురించి ఏ పురాణంలోను ప్రస్తావించలేదు.