అధికమాసం.. తెలుగు నెలలో మూడేండ్లకొకసారి అధికమాసం వస్తుంది. అసలు అధికమాసం అంటే ఏమిటి ? దీని వెనుక శాస్త్రీయత తెలుసుకుందాం…
మన పూర్వీకుల గణనలు కచ్చితత్వంతో కూడుకున్నవి. ఎటువంటి సాంకేతికత లేని రోజుల్లోనే సూర్యుడికి భూమికి మధ్య దూరాన్ని కనిపెట్టిన ఘనులు మన పూర్వీకులు. అలాంటి గణనకు సంబంధించినదే అధికమాసం. ఆ విశేషాలు..
భూమికి – సూర్యుడి చుట్టూ తిరగడానికి 365+ రోజుల సమయం పడుతుంది. సూర్య సిద్ధాంతపరంగా సరిగ్గా చెప్పాలంటే 365.258756 (365 రోజుల 6 గంటల 12 నిమిషాల 36+ సెకండ్లు). ఇది నాక్షత్రిక గణనము (Sidereal duration). నేటి ఆధునిక శాస్త్రీయ లెక్కలను బట్టి 365.256362 (365 రోజుల 6 గంటల 9 నిమిషాల 8+ సెకండ్లు) సమయం పడుతుంది. ఇది కూడా నాక్షత్రికమే.సూర్య సిద్ధాంత పరంగా మరియూ నేటి ఆధునిక శాస్త్రపరంగాగానీ, రమారమిగా 29.53 రోజుల్లో చంద్రుడు భూమి చుట్టూ తిరగుతాడు (Synodic month). ఈ మాసాన్ని రెండు పక్షాలుగా; ఒక్కో పక్షం 15 తిథుల కిందా విభాగింపబడింది. ఒక్కో తిథి కనిష్టంగా 21+ గంటల నుండి గరిష్టంగా 26+ గంటల వ్యవధి కలిగి ఉండవచ్చు. ఈ లెక్కన 354+ రోజుల్లో పన్నెండు మాసాలు పూర్తి అవుతాయి.
చాంద్రమాన పద్ధతిలో అమావాస్య నుండి అమావాస్య మధ్యనున్న రోజులను గానీ పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు గల సమయాన్నిగానీ చాంద్రమాన మాసంగా పరిగణిస్తారు. చాంద్రమాన లెక్కలమీద ఆధారపడే దక్షిణ దేశస్తులు, అమావాస్యను ప్రతి మాసపు అవధిగా పరిగణిస్తే, ఉత్తర భారత దేశంలో పౌర్ణమిని లెక్కలో తీసుకుంటారు. అమావాస్యను పరిగణించే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలయితే పౌర్ణమిని వాడుకొనే రాష్ట్రాలొచ్చి బీహార్, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాంచల్, ఉత్తర్‌ప్రదేశ్ ఇత్యాది రాష్ట్రాలు. ఈ రెండు పద్ధతులలో శుక్ల పక్షాలు సరితూగుతాయిగానీ కృష్ణ పక్షాల మాసాలు మారతాయి. ఉదాహరణకు భాద్రపద శుద్ధ చవితి రెండు లెక్కలలో వినాయక చవితే కానీ శ్రీకృష్ణాష్టమి దక్షిన దేశంలో శ్రావణ బహుళ అష్టమికాగా ఉత్తరాదిలో భాద్రపద బహుళ అష్టమి అవుతుంది. ఇది పూర్తిగా అర్థం కాకపోయినా ఫరవాలేదుగానీ చాంద్రమాసం అంటే ఏమిటో తెలిస్తే సరిపోతుంది.
మన తెలుగువారు చాంద్రమాన అమావాస్యాంత (అమాంత) పద్ధతిని పాటిస్తారు. కానీ, గమనించి చూసినట్లయితే మనకూ కొన్ని సౌరమాన పండుగలుంటాయి. ఉదాహరణకు మకర సంక్రాంతి, ధనుర్మాసం ఇత్యాదులు. ప్రతి నెలలో వచ్చే మాస సంక్రాంతి, సంక్రాంతి పండుగగా జరుపుకునే మకర సంక్రాంతులు – సూర్య గమనంపై ఆధారపడి ఉంటాయి. అందుకే సాధారణంగా సంక్రాంతి పండుగ జనవరి 14, 15 తేదీలలో మాత్రమే వస్తూ ఉంటుంది. కాబట్టి 354+ రోజుల్లో పూర్తయ్యే చాంద్రమాన సంవత్సరానికి 365+ రోజులతో ఉన్న సౌరమాన సంవత్సరానికి సమన్వయాన్ని కొనసాగించాలి. లేకపోతే మాస ఋతువుల పొంతన దెబ్బ తింటుంది. రెండు సంవత్సర లెక్కలలో ఉన్న 11+ రోజుల తేడాను సరిదిద్దేదే ఈ అధిక మాసం అనే పద్ధతి ప్రవేశపెట్టారు.