Eenadu ; ఈనాడు ఎత్తివేత..!? ఈ విషయాన్నీ “న్యూస్ ఆర్బిట్” ఎనిమిది నెలల ముందే చెప్పింది. అంటే పూర్తిగా మూసెయ్యడం కాకుండా… క్రమక్రమంగా డిజిటలైజ్ చేసి, ఆ తర్వాత ప్రింట్ ఆపేసే ప్రయత్నాలు “ఈనాడు”లో జరుగుతున్నాయని గత ఏడాది ఆగష్టులో “న్యూస్ ఆర్బిట్” ప్రచురించింది. ఇప్పుడు ఇదే కోవకి చెందిన.., “ఈనాడు” విషయంలో రామోజీరావు అంతర్గతంగా చేస్తున్న ఒక ఆలోచన కొత్త వ్యాపార అర్ధాలకు దారి తీస్తుంది. రామోజీ అంటే ఇదీ అని రుజువుచేస్తుంది..!

Eenadu ; ఈనాడుకు కొత్త దారులు వెతుకుతూ..!!
ప్రింట్ ఎడిషన్లకు కష్ట కాలం దాపురించింది. ఈనాడు ఒక్కటే కాదు దేశం మొత్తం అలాగే ఉంది. తెలుగునాట మరింత దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా తనకు కష్టం రాకుండా ముందుచూపుతో ఆలోచించే అత్యుత్తమ వ్యాపారవేత్త రామోజీరావు. అందుకే ఈనాడు కష్టాలను ముందే ఊహించి అయిదేళ్ల కిందటే “ఈటివి భారత్” కి శ్రీకారం చుట్టారు. కానీ అది కూడా ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మూటగట్టుకుంది. ఇప్పటికే ఈనాడుకి అనుబంధంగా స్పెషల్ పేజీలు ప్రింటింగ్ ఆపేసి, ఆన్లైన్ లో మాత్రమే అందిస్తున్నారు. ఈనాడు పేజీలు తగ్గించేశారు. ఇక ఈనాడు కూడా డిజిటలైజేషన్ చేసి అనేక మార్పులు చేసుకొచ్చారు. క్రమేణా పాఠకులు తగ్గిపోయారు. సర్క్యులేషన్ సగానికి పైగా పడిపోయింది. ఈ కష్టాలకు రామోజీ ఒక చిట్కా రూపొందిస్తున్నారు. తాను ఉన్నప్పుడే ఈనాడుకు ఒక దారి చుపించాలనేది ఆయన యోచన.

రామోజీ స్థావరం – వియ్యంకుడి వ్యాపారం..!!
ఈనాడు ప్రింట్ తగ్గించాలి, ఆపై ఆపేయాలి అనేది ఒక ప్రణాళిక. ఏడాది లేదా రెండేళ్లు.. కానీ మొత్తం ఆన్లైన్ కి అలవాటు చేయడం వారి లక్ష్యం. అదే జరిగితే ఈనాడుకు జిల్లాల్లో ఉన్న అన్ని కార్యాలయాలు మూసేయొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈనాడు ప్రింట్ కార్యాలయాలు ఉన్నాయి. రెండేళ్ల కిందటే ఈనాడు రామోజీ మానవరాలుని – భారత్ బియోటెక్ ఎండీ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఈనాడు జిల్లా యూనిట్లను భారత్ బియోటెక్ గోడౌన్లుగా మార్చాలి.. ఆయా జిల్లాకు సరఫరా కానున్న భారత్ బయోటెక్ మందులను ఈ ప్రాంతాల్లో నిల్వ చేయాలి అనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈనాడు – భారత్ బియోటెక్ సంయుక్తంగా ఔషధ వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నాయి. ఆలా రామోజీ స్థావరాలను ఆయన వియ్యంకుడి వ్యాపార ఆస్థానాలుగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.

మరో మూడేళ్లు మాత్రమే బండి లాగాలి..!!
ఈనాడు పత్రిక 1974 , ఆగష్టు 10 న ప్రారంభమయింది. అంటే మరో మూడేళ్లు గడిస్తే యాభై ఏళ్ళు పూర్తవుతుంది. ఈ మార్కు కోసం ఈనాడుని ఎలాగోలా మూడేళ్లు కొనసాగించాలి అని యాజమాన్యం భావిస్తోందట. అప్పటికి కొన్ని జిల్లాల డిస్కులను, యూనిట్లను మూసేస్తే… ప్రతి జిల్లా నుండి కనీసం 50 మంది ఉద్యోగులను (ప్రింట్ మిషన్ సెక్షన్, డెస్క్, యూనిట్ స్టాఫ్) తప్పించవచ్చు. అలా మూడేళ్లు పొదుపు పాటించి.., ఆ యాభై మార్కు చేరుకున్న తర్వాత ఈనాడుని పూర్తిగా ఆపేస్తే బాగుంటుంది అని పెద్దలు ఆలోచన చేస్తున్నారు. ఈ లోగా ఈనాడు వెబ్సైట్, ఈటీవీ భారత్, ఈనాడు డిజిటల్ వ్యవస్థలను బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.