బాలు మరణం… రామోజీ చుట్టూ వివాదం..!!

ఓ మరణం కోట్ల మందికి కన్నీటిని రాల్చింది..! గుండెను బరువెక్కించింది..! గొంతు వణికించింది..! తన పాటతో ఆ కళ్ళలో భావాలను పలికించగల.., గుండెను చిందేయించగల.., గొంతులో శృతి కలిపించగల దిగ్గజ గాయకుడు బాలు మరణం దేశ పాటాభిమానులకు.., తెలుగు పాటప్రియులకు ఎనలేని శోకాన్ని మిగిల్చింది. ఈ మరణం కొన్ని ప్రశ్నలను వదిలి వెళ్ళింది. బాలు అనే దిగ్గజ సింగర్ మరణం రామోజీ అనే దిగ్గజాన్ని వివాదంలోకి లాగింది.

“కరోనా ఎలా అయినా వస్తుంది. కానీ బాలుకి ఎలా వచ్చింది? అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేసే సోషల్ మీడియా బాలుకి కరోనా రావడానికి కారణాలను చెప్పేసింది. “రామోజీరావు సంస్థ ఈటీవి నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి బాలు హాజరయ్యారు. అక్కడ అప్పటికే చాలా మందికి కరోనా పాజిటివ్ ఉంది. తద్వారా బాలుకి కూడా వచ్చింది. నిజానికి బాలు “నేను రాలేను నన్ను వదిలెయ్యండి” అని చెప్పినా సరే ఒత్తిడి చేశారు. కాదనలేక బాలు కుటుంబం సహా వచ్చారు. అందరి మధ్య పాడారు. అందుకే బాలుకి కరోనా వచ్చింది. మొత్తానికి కారణం రామోజీరావు” అనేది ఆ సామజిక మాధ్యమాల్లో వస్తున్న సందేశ సారాంశం. ఓ పత్రిక కూడా పరోక్షంగా ఇదే రాసింది. దీన్ని ఎవరూ నిర్ధారించలేరు. కరోనా కారణంగా ఒకరి మరణాన్ని మరో దిగ్గజంపై వేయలేం. అది నైతికత కాదు.

అందులోకి బాలుకి రామోజీ అంటే ఎంతో ఇష్టం. రామోజీకి బాలు అంటే ఎంతో అభిమానం. అందుకే బాలుకి సినిమాల్లో పాటలు లేని వేళల్లో తన “పాడుతా తీయగా, స్వరాభిషేకం, ఈటివి 20” తదితర కార్యక్రమాల్లో బాలుని కీలకం చేసారు. దేనికీ మీడియా ముందుకు, వీడియో ముందుకు రాణి రామోజీ బాలు మరణంతో ఓ నివాళి వీడియో కూడా వదిలారు. కారణం ఏదైనా కరోనా వచ్చింది, బాలుని కాటేసింది. దూరం చేసింది. కానీ రామోజీని ప్రశ్నించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి.

spbalu death trolls ramojirao
spbalu death trolls ramojirao

సిబ్బంది మరణం..! కారణం ఎవరు..??

బాలు మరణం రామోజీపై వేయలేం. అది నైతికత కాదు. అది కేవలం బాలు కుటుంబ సభ్యులు మాత్రమే వేయాలి, మాట్లాడాలి. కానీ ఈనాడు సిబ్బంది మరణం మాత్రం ఎవరి ఖాతాలో వేయాలి..? కరోనా వస్తుంది, మనుషులను చంపేస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని దేశం, సమాజం మొత్తుకుంటున్నా “ఈనాడు” అనే సంస్థ తీసుకున్న అజాగ్రత్తలు కొన్ని ప్రాణాలను తీసుకుపోయాయి. పశ్చిమ గోదావరి ఈనాడు డెస్క్ ఇంచార్జి శేషాచార్యులు. వయసు 56 , కరోనా కారణంగా మరణించారు. ఎవరైనా కాదనగలరా..? ఈయనకు కరోనా రావడానికి కారణం ఎవరు..? ఈనాడు ఆ డెస్కులో ఆరుగురికి కరోనా సోకింది. ఆ డెస్కు మాత్రమే కాదు. ఈనాడు ప్రతి కార్యాలయంలోనూ కరోనా బారిన పడిన వారు అనేకం ఉన్నారు. భూమిపై నూకలు తినాలని ఉంటె తిరిగి క్షేమంగా వస్తున్నారు, లేకపోతే కాలం చెల్లుతుంది. ఇలా ఈనాడులో ఉద్యోగుల కుటుంబాలు వేలాదిగా మౌనంగానే, పంటిబిగువున రోదించాయి.

spbalu death trolls ramojirao
spbalu death trolls ramojirao

* ఎంతటి కర్మ అంటే..! కరోనా వచ్చిన వేళ.., ఆ ఉద్యోగులకు కనీసం వేతనంతో కూడిన సెలవులు ఇవ్వలేదు. సెలవు తీసుకుంటే జీతం కట్!! కరోనా భయంతో ఉన్న వారికి కనీసం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వలేదు. కరోనా విపరీతంగా వ్యాపిస్తున్నా కనీసం జాగ్రత్తలు తీసుకోలేదు. తన భవంతి ముందు ఉన్న ఈనాడు కేంద్ర కార్యాలయంలో 25 మందికి పైగా కరోనా బారిన పడినా కనీసం మిగిలిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వలేదు. ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈనాడులో అనేక మంది కరోనా బారిన పడడానికి ఆ యాజమాన్యం కారణం, కొన్ని మరణాలకు వారి తీరే కారణం. బాలు మరణం వదిలేద్దాం..? మరి ఈ మరణాలు ఎవరి ఖాతాలో వేద్దాం..?

లే ఆఫ్ లు, వేధింపులు..!!

ఇక చిన్న చిన్న ఉద్యోగులకు పీకేయడానికి కరోనా ఈనాడు సంస్థకి బాగా ఉపయోగపడింది. ఏప్రిల్ నెల నుండి జీతాల్లో కోతలు విధించిన ఆ యాజమాన్యం. జూన్ నుండి లే ఆఫ్ అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే యాడ్స్ , సర్క్యులేషన్, ప్రింటింగ్ విభాగాల్లో అనేక మందికి తొలగించింది. దాదాపు 1200 వందల మందికి కరోనా వంటి ఆపత్కాలంలో రోడ్డున పడేసింది. ఇలా కరోనా సాకుగా చూపించి జీతాలు ఎగ్గొట్టి, ఉద్యోగాలు పీకేసిన ఆ సంస్థ..! అదే కరోనా సాకుగా చూపి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకివ్వలేదు..? వైరస్ సోకితే వేతనంతో కూడిన సెలవులు ఎందుకు ఇవ్వలేదు..? అదే “మాయదారి వ్యాపార బుద్ధి”..!!

ఎన్ని మూటగట్టుకుంటే ఏం లాభం,!?

వేల కోట్ల భవనాలు.., వందల ఎకరాలు.., ఘనమైన చరిత్ర.., మాంచి అవార్డులు.. ఇలా ఎన్ని మూటగట్టుకుంటే ఏం లాభం..! ఇటువంటి ఆపత్కాలంలో చూపాల్సిన చొరవ, ఉద్యోగులపై కరుణ లేకుండా పరోక్షంగా రోదనలకు, వేదనలకు, వేధింపులకు కారణం అయినప్పుడు అవన్నీ బూడిద కంటే హీనం. ఫక్తు వ్యాపార ధోరణి మనుషులను ఇలా మార్చేస్తుంది. లాభ, నష్టాలు బేరీజు వేసుకుని.., పక్కా లెక్కలు ఆధారంగానే ఆ సంస్థలు నడుస్తాయి. ఏ మాత్రం మానవత్వ విలువలు, నైతికత అక్కడ మచ్చుకి కూడా దొరకవు.