Telugu Cine Industry: తెలుగు సినిమాకు సిగ్గులేదందామా..!? సత్తా లేదందామా..!?

Telugu Cine Industry: Shameless or Talent Less..!?
Share

Telugu Cine Industry: సగం విప్పి చూపించే హీరోయిన్.. భారీ డైలాగులు చెప్పి మూతి ముద్దులు పెట్టి, ఫైట్లు చేసే హీరోని చూడాలంటే “రొమాంటిక్”..!

అర్ధం లేని స్నేహం మధ్య.. అర్ధం కాని అపార్ధాలను తెచ్చి.. భారీ బిల్డప్పుల మధ్య ఫైట్లు చూడాలంటే “మహా సముద్రం”..!

కథ లేకుండా.. కథనం అర్ధం కాకుండా.. సుత్తి పెట్టి నెత్తిన కొట్టేలాంటి సినిమా చూడాలంటే “మంచిరోజులొచ్చాయి”..!

చిన్న పాయింట్ పట్టుకుని రెండున్నర గంటల సినిమాగా తీసి.. ప్రేక్షకులకు బీపీ పరీక్ష పెట్టె సినిమా చూడాలంటే “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్”..!

హీరోని హైలెట్ చేయడానికి లాజిక్కులేని సీన్లు, కథకు సంబంధం లేని పాత్రలు సృష్టించి పులిహోర సినిమా కావాలంటే “టక్ జగదీశ్”..!

ఒక పెళ్లి సీన్.. బాకా ఊదే పాత్రలు.. ఆపై హీరోయిన్ బొడ్డు.. హీరోయిన్ నడుము చుట్టూ పూలు, పళ్ళేసి కొట్టే హీరో సినిమా కావాలంటే “పెళ్లి సందD”..!

Telugu Cine Industry: Shameless or Talent Less..!?
Telugu Cine Industry: Shameless or Talent Less..!?

ఇలా ఎన్నో ఆణిముత్యాలు. ఎన్నెన్నో సినీ ముత్యాలు..! వరుడు కావలెను, శ్రీదేవి సోడా సెంటర్, గల్లీ రౌడీ ఇలా ఎన్నెన్నో ఆణిముత్యాల మధ్య కొండపొలం, రిపబ్లిక్, ఎస్సార్ కల్యాణ మండపం, లవ్ స్టోరీ.. లాంటి కథాబలమున్న కొన్ని చిన్నపాటి చిత్రాలొచ్చి బోర్లాపడ్డాయి.. తెలుగు సినిమా తెరపై ఇటీవల మెరిసి ఇరగదీసిన సినిమాలివి. ఈ సినిమాలను చూడాలంటే బోలెడు సహనం ఉండాలి. రొమాంటిక్ ఒక్కటే సహనంతో సంబంధం లేకుండా కేవలం కామనాడులు ఉన్న ప్రతీ మగాడు కాసేపు చూడొచ్చు.. అది కూడా హీరోయిన్ కనిపించినప్పుడు మాత్రమే..! కానీ ఈ సినిమాలు.. వాళ్ళు చేసే హడావిడి.. వాళ్ళు చెప్పే మాటలు.. వాళ్ళు ఇచ్చే బిల్డప్పులు చూస్తే “తెలుగు సినిమాకు సిగ్గు లేదా..? సత్తా లేదా..!? అనే సందేహం వస్తుంది. “సత్తా లేక తీయలేదేమో” అని అనిపిస్తుంది.. అంతలోనే… నాంది, రిపబ్లిక్ లాంటి కథలు మనోళ్లే తీశారు అని గుర్తొచ్చినప్పుడు.. సత్తా పది శాతం ఉన్నప్పటికీ… సిగ్గులేని తనం ముందు ఆ సత్తా చిన్నబోతుంది అని ఫిక్సవ్వాల్సి వస్తుంది..!

Telugu Cine Industry: జై భీమ్.., వరుణ్ డాక్టర్.., కర్ణన్.., అసురన్.. మనం తీయలేమా..!?

ఈ మధ్య తమిళంలో వచ్చిన సినిమాలు దేశం మొత్తనాన్ని తమవైపునకు తిప్పుకున్నాయి. దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా చేశాయి. దేశం మొత్తం అన్ని భాషల్లో కళ్ళార్పకుండా చూసేలా చేశాయి.. ఇటీవల వచ్చిన జై భీమ్ సినిమా దేశంలో ప్రస్తుతం సెన్సేషన్.. నిజమైన కథతో .. నిజమైన సన్నివేశాలతో.. అంతే నిజమైన పాత్రలు, సహజత్వమున్న నటనలతో అన్ని రకాలుగా ఈ సినిమా దేశం మొత్తం ఆకట్టుకుంది. ఇండియాలో సినిమాలకు అత్యుత్తమ రేటింగ్ గా భావించే IMDB లో ఈ చిత్రానికి 9.7 రేటింగ్ వచ్చిందంటే ఈ సినిమా హవా అర్ధం చేసుకోవచ్చు. గుండె బరువెక్కే.. కళ్ళు చెమర్చే సన్నివేశాలతో ఈ సినిమా ఆద్యంతం ఒక అద్భుతం..!

Telugu Cine Industry: Shameless or Talent Less..!?
Telugu Cine Industry: Shameless or Talent Less..!?

* వరుణ్ డాక్టర్.. కథ సాధారణం.. కానీ కథనం కొత్తదనం. సీరియస్ కిడ్నాప్ కథకి మాంచి టైమింగ్ ఉన్న కామెడీని జోడించి సినిమాను కొత్తగా తెరకెక్కించారు. భారీ బిల్డప్పులు, భారీ సెట్టింగులు.. భారీ ఐటెం పాటలు, సగం సగం చూపించే హీరోయిన్లు లేకుండా సింపుల్ గా తీశారు.. ఈ సినిమా కూడా ప్రస్తుతం దక్షిణాదిన ఊపుతుంది..!

* ఇవే కాదు.. కొన్ని నెలల కిందట వచ్చిన కర్ణన్.. అంతకు ముందు వచ్చిన అసురన్.. సూపర్ డీలక్స్.. ఇంకా ఎన్నో సినిమాలు.. ఇతర బాషల నుండి తెలుగులోకి అనువదిస్తే.. తెలుగు తెరని ఏలాయి. తెలుగు వీక్షకుడి గుండెను తాకాయి.. కథలో కొంచెం కొత్తదనం.. కథనంలో కాస్త కొత్తదనం చూపిస్తూ తమిళ హీరోలు, దర్శకులు కథలను నమ్మి సినిమాలను తీస్తుంటే.. తెలుగులో మాత్రం ఫైట్లు, బిల్డప్పులను నమ్మి సినిమాలు తీస్తున్నారు.

నిర్మాతలే విలన్లు..! డబ్బే ప్రధానం..!!

ఎస్… సినిమా అంటే వ్యాపారమే.. ఎవ్వరూ కాదనరు.. కానీ మంచి సినిమా తీశామన్న తృప్తి.. మానసిక సంతోషం కోసం.., ప్యాషన్ తో సినిమాలు తీసే నిర్మాతలు కరువయ్యారు.. రాజకీయాల్లోనూ.., రియల్ ఎస్టేట్ లోనూ డబ్బుని సంపాదించి… సేఫ్ గా పెట్టుబడి పెట్టడానికి ఇది మార్గం అనుకుంటూ ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఏదో పది శాతం లాభం వచ్చినా చాలు బతికేయొచ్చు.. ఎంజాయ్ చేయొచ్చు అనే ధీమాతో సినీ పరిశ్రమకు ఇప్పటి నిర్మాతలు వస్తున్నారు. అందుకే తెలుగు సినీ పరిశ్రమకి నిర్మాతలే విలన్లు. హీరో మార్కెట్ ని బట్టి ఒక సినిమా తీశామా..? 10, 20 శాతం లాభానికి అమ్మేశామా..!? ఎంజాయ్ చేసేసామా..!? ఓ వైపు పేరు, మరోవైపు ఎంజాయ్..? ఇంకోవైపు కొంచెం డబ్బు… ఇదీ తెలుగు పరిశ్రమలో నిర్మాతల తీరు. కథలకు విలువనివ్వకుండా.. హీరోలకు విలువనిస్తూ.., మార్కెట్ చూసుకుంటూ పరిశ్రమ బండిని లాగిస్తున్నారు. కొత్త కథలతో రిస్క్ లోకి దిగడం లేదు. లో బడ్జెట్ కి మొగ్గు చూపడం లేదు. మరో ట్విస్టు ఏమిటంటే… తెలుగు పరిశ్రమలో…. కథకు తగ్గ హీరోని వెతకరు… ముందే హీరోని ఫిక్సయ్యి.. ఆపై వాడికి తగిన కథ రాసుకుంటారు. ఆ కథలో కచ్చితంగా ఆరు ఫైట్లు, ఆరో, ఏదో పాటలు.. రెండు, మూడు భారీ బిల్డప్పులు ఉండాల్సిందే.. నిర్మాతలకు, హీరోలకు ఇదే కావాలి.. కథని ప్రేమించే నిర్మాతలు, హీరోలు లేరు. అదే తెలుగు సినిమాకు పెద్ద మైనస్. అందుకే సత్తా ఉన్నా.., సిగ్గులేని తనం కప్పేస్తున్న తెలుగు సినిమా నీకు శతకోటి జోహార్లు..!!


Share

Related posts

చిరంజీవి, ర‌వితేజ త‌ర్వాత నానియే : కార్తికేయ‌

Siva Prasad

Kajal Aggarwal : వామ్మో.. కాజల్ అగర్వాల్ కు ఆ ఇద్దరిని చూస్తే కొట్టాలనిపిస్తుందట.. ఇంతకీ ఎవరో తెలుసా..?

Teja

తండ్రితో నాలుగోసారి

Siva Prasad