YS Jagan: జయహో జగన్.. అనాలని ఉంది కానీ..! Birthday Special Article

YS Jagan: I Cant Say Jayaho Jagan.. Because
Share

YS Jagan: “జగన్ అంటే ఒక్క అక్షరంతో మొదలై.. ఒక పేజీకి పాకి.., ఒక పాఠంగా మారి.., చివరికి ఒక పుస్తకంగా ఎదిగిన మహత్తర కావ్యం.. పార్టీ పెట్టడమే ఒక పాఠం.. పార్టీని నడిపించడం మరో పాఠం.. జైలుకి వెళ్లి వచ్చాక తెగింపుతో జనాల మధ్య ఎదగడం మరో మహత్తర పాఠం.. ప్రజాసంకల్ప యాత్ర పేరిట జనాల్లో నడవడం మరో పెద్ద పాఠం.. ఆ పాఠాలకు ప్రతిఫలమే ఆ గెలుపు. ఆ పై ఆలనా, పాలన.. లాలన అన్నీ మహత్తర పాఠాలే. పాఠాలు కలగలిసిన పుస్తకమే. ఆ పుస్తకానికి “జయహో జగన్” అని పేరు పెట్టాలనే ఉంది.. కానీ..!

మొండిదేరిన మనసు.. రాటుదేలిన వయసు.. ఆలోచనల్లో గడుసు.. సంక్షేమ పాలనా గొలుసు..! వెరసి జగన్ అంటే జగనే.. జయహో జగన్ అనాలనే ఉంది.. కానీ..!

తండ్రిని మించిన పాలన.. ప్రజల క్షేమం పట్ల ఆలన.. పేదలంటే అక్కున చేర్చుకునే లాలన.. నమ్మిన వారికి అందలమిచ్చే పోషణ..! వెరసి జగన్ అంటే జగనే.. జయహొ జగన్ అనాలనే ఉంది.. కానీ..!

YS Jagan: I Cant Say Jayaho Jagan.. Because
YS Jagan: I Cant Say Jayaho Jagan.. Because

పెద్ద శక్తులను సైతం ఎదిరించిన నాటు.. జైలు గోడలను తాకి వచ్చిన ధీటు.. ముదిరిన ప్రత్యర్థులను ఓడించిన ఘాటు.. ప్రజల మనస్సులో చెదరని చోటు..! వెరసి జగన్ అంటే జగనే.. జయహో జగన్ అనాలనే ఉంది.. కానీ..!

“తండ్రి మరణం నిన్ను నాయకున్ని చేసింది.. కాంగ్రెస్ అవమానం నిన్ను జనాలకు దగ్గర చేసింది.. అవినీతి అనే కేసు నిన్ను రాటుదేల్చింది.. జైలు గోడ నీలో కసి రగిల్చింది.. ప్రత్యర్థి తప్పుల పాలన నిన్ను జననేతగా మార్చింది..” నీ చెమట, నీ కన్నీరు, నీ కష్టం, నీ గతం, నీ ఆలోచన నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది”..! జగన్ అంటే జగనే.. జయహో జగన్ అనాలనే ఉంది.. కానీ..!

ఒక్క ఎమ్మెల్యే సీటు.. ఒక్క ఎంపీ సీటుతో మొదలై.., 17 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలకు ఎదిగి.., 62 ఎమ్మెల్యేలు, 7 ఎంపీల వరకు బలపడి.. చివరికి 151 ఎమ్మెల్యేలు.., 22 మంది ఎంపీల వరకు అంచెలంచెలుగా ఎదిగిన జగన్ అంటే దేశంలో చాలా మంది ఆదర్శంగా తీసుకోవాల్సిన నాయకత్వమే..! చదువు కోసం అమ్మఒడి.. సుస్తీ చేస్తే ఆరోగ్యశ్రీ.. కష్టం చేస్తే జగనన్న నేస్తం.. సేద్యానికి రైతు భరోసా.. విభిన్న సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న నీ పరిపాలన దేశం మొత్తం ఆచరించాల్సినదే..! జగన్ అంటే జగనే.. జయహో జగన్ అనాలనే ఉంది.. కానీ..!

జనంతో కలిసి, జనం మధ్య ఎదిగి, జనం మద్దతుతో కుర్చీ ఎక్కిన నీ తెగువ చూసి.., అడిగిందల్లా ఇస్తానన్న నీ మనసు చూసి.. అన్ని వర్గాలకు భరోసానిచ్చిన నీ మాట చూసి.. ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న నీ పాలన చూసి.. చాణక్యుడిగా పేరొంది.. ముదిరిన ప్రతిపక్షాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న నీ తెలివి చూసి.., ఆర్ధిక కష్టాలు వెక్కిరిస్తున్నా ఒక్క పథకమూ, ఒక్క రోజూ ఆలస్యం చేయని నీ నిబద్ధత చూసి.., పేదల గుండెల్లో తండ్రి పక్కనే మనస్సులో చోటు పొందాలన్న నీ తపన చూసి… జగన్ అంటే జగనే.. జయహో జగన్ అనాలనే ఉంది.. కానీ..!

YS Jagan: I Cant Say Jayaho Jagan.. Because
YS Jagan: I Cant Say Jayaho Jagan.. Because

ముమ్మాటికీ ఇప్పట్లో అనను, అనలేను..! అందుకు అనేక కారణాలు ఉన్నాయి.. “ఏం చూసి జనం ఓట్లేసారో అది సంపూర్ణంగా సాధించలేదు”.. “గత పాలకుల పాపాలతో విసిగిన జనానికి కొత్త పాలనని పరిచయం చేసినట్టే చేసి మళ్ళీ పాపాలు కొనసాగిస్తున్నట్టే ఉంది..”.. “అవినీతిని బయటకు తీసినట్టే తీసి మళ్ళీ.. దాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తున్నట్టే ఉంది..”.. “పాలన అంటే పథకాలు.. దాని వెంట ప్రచారమే కాదు… పాలన అంటే ప్రగతి.. పాలన అంటే పెట్టుబడి.. పాలన అంటే పారిశ్రామికం.. పాలన అంటే ప్రాజెక్టులు..”..! పాలన అంటే అందులో భాగంగా రాజకీయం, రాజకీయ ప్రయోజనం ఉంటుంది, ఉండొచ్చు.. కానీ గత పాపలు చేసిన వారిని వేధించి, దారిలోకి తెచ్చుకోవడమో, విసిగించడమో కాదు.. “వారిని జనాల ముందు దోషులుగా నిలబెట్టడం.. ఆ మింగిన సొమ్ము రాబట్టడం.., ఆ అవినీతిని కడిగేయ్యడం.. ఆ మరకలు తుడిచెయ్యడం.. ఆ జ్ఞాపకాలు చెరిపెయ్యడం.. వారి రాజకీయ జీవితానికి ముగింపు పలకడం”.. కానీ.. “మీరు నాడు పాపాలు చేశారు.. మాలో కలిస్తే మీ పాపాలు సుద్ధి చేసేస్తాం” అనడం అసలు పాలన కానే కాదు..!

YS Jagan: I Cant Say Jayaho Jagan.. Because
YS Jagan: I Cant Say Jayaho Jagan.. Because

పాలన అంటే కులాల విభజన కాదు, పాలన అంటే మీడియాపై ఏడవడం కాదు..! వారి కులం వారి కులమే, మీ కులం మీ కులమే, ఎవరిదైనా కులమే..! వారి మీడియా వారి మీడియానే, మీ మీడియా మీ మీడియానే, ఎవరిదైనా మీడియానే..! అందులో తప్పులు, ఎంచుకోడాలు, ఏడుపులకు అవకాశమే లేదు..! పాలన అంటే నాలుగు గదుల్లో సమీక్షలు, నలభై రోజులకోసారి చిన్న సభకు వెళ్ళడాలు (అలా వెళ్ళినప్పుడు కూడా విపరీత ఆంక్షలతో జనాలకు అభద్రతా కలిగించడం).. నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఓట్ల వేటకు బయల్దేరడం కానే కాదు.. జగన్ అంటే జనం నుండి వచ్చిన నాయకుడు. జగన్ అంటే జనం మెచ్చి ఓట్లేసిన నేత. జగన్ అంటే జననేత.. కానీ ఇప్పుడు జనాలకు కూడా అందకుండా.. జనాలకు కూడా అక్కడక్కడా అభద్రత, అసౌకర్యం కలిగేలా అతి చేస్తున్న కొందర్ని పక్కన పెట్టుకుని పోషించినంత కాలం.. జగన్ అంటే జయహో అనను.. అనలేను..! చిన్న చిన్న లోపాలు.. చిన్న పెద్దా తప్పులు.. సరిదిద్దుకుంటే చిరకాలం కుర్చీ సాధ్యమే. లేకపోతే మళ్ళీ గతమే..! ఇక చివరిగా కెరటం చూడడానికి తీరానికి వెళ్లిన వాళ్ళు కెరటం పైకి చూస్తారు, ఆస్వాదిస్తారు.. కానీ ఆ కెరటం అలా లేవడానికి పడే అంతర ఒత్తిడి సముద్రానికి మాత్రమే తెలుసు.. చూసే జనాలకు తెలియదు..! సో.. మీరిప్పుడు లేచిన కెరటం. మీరు లేవడానికి పడిన కష్టాలు మీలో అంతర్భాగమైన సముద్రానికి తెలుసు. కానీ.., లేచిన కెరటాన్ని చూసి.. అది శాశ్వతం అనుకునే భ్రమ కూడా మీలో ఉన్నట్టుంది, అందుకే ఆ అంతర్భాగాన్ని కప్పేస్తుంది..! అందుకే “జయహో జగన్ అనను.. ఇప్పట్లో అనలేను..!

                                                                                            – By Journalist MS (Manem Srinivas) 


Share

Related posts

సర్వే ఓ మాయ… నమ్మితే మటాషే..!!

somaraju sharma

Bezawada Durgamma Temple : దుర్గమ్మ ఆలయంలో అవినీతి కొండంత!

Comrade CHE

టీడీపీ X వైసీపీ X బీజేపీ..! దెబ్బలు తింటున్న దేవుడు ఊరకే ఉంటాడా..!?

Srinivas Manem