YSRCP: ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో వైసీపీ అనూహ్యంగా గెలుపొందింది. అక్కడ పార్టీకి బలం లేదు. పార్టీకి పునాదులు లేవు. పార్టీ గెలుపు ఇక్కడ కష్టమే, టీడీపీ పునాదులు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇవి టీడీపీకి కంచుకోట అనుకున్న నియోజకవర్గాలు చాలా చోట్ల వైసీపీ అవలీలగా గెలిచేసింది. అదీ భారీ మెజార్టీతో గెలిచింది. అయితే ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లోని కొన్నింటిలో వైసీపీకి ఎదురుగాలి తప్పడం లేదు. వైసీపీలో వర్గాల కారణంగా, పార్టీలోనే నియోజకవర్గ స్థాయిలో శతృవుల కారణంగా, అక్కడ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పెద్ద గ్రూపులు ఉంటున్న కారణంగా రాష్ట్రంలోని ఒక 15 నియోజకవర్గాల్లో వైసీపీకి చాలా సీరియస్ ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది.
YSRCP: వైసీపీలో గ్రూపులు
ఉదాహారణకు తీసుకుంటే..గుంటూరు జిల్లా గురజాలలో ఇన్ చార్జిగా మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి ఉండే వారు. ఆయన వైసీపీ లో చాలా యాక్టివ్ గా ఉండే వారు. ఆయన గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయనకు టికెట్ ఇస్తారేమో అనుకుంటే ఆయన స్థానంలో కాసు మహేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు కృష్ణమూర్తికి వేరే పదవి ఇచ్చారు. ఇప్పుడు నియోజకవర్గంలో కృష్ణమూర్తి, మహేష్ రెడ్డి ల వర్గాలు వేరువేరుగా ఉన్నాయి. ఆయన ఆఫీసు వేరు, ఈయన ఆఫీసు వేరు. పార్టీ కార్యకర్తలు కూడా ఎవరికి వారు ఆయా వర్గాలుగా విడిపోయి వెళుతున్నారు. అదే విధంగా కడప జిల్లా పొద్దుటూరులో ఎమ్మెల్యేగా రాచమల్లు శివప్రసాదరెడ్డి ఉన్నారు. అక్కడ రమేష్ యాదవ్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ రమేష్ యావద్ వర్గం వేరు, ఎమ్మెల్యే రాచమల్లు వర్గం వేరు. ఇద్దరి ఆఫీసులు వేరువేరుగా ఉన్నాయి. ఎవరికి వారు పనులు కావాలంటే వేరువేరుగా వెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రమేష్ యాదవ్ పోటీ చేయబోతున్నారని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది. అక్కడ ఒకళ్లకు టికెట్ ఇస్తే మరోకరు సహకరించే అవకాశం ఉండదు.
ఎమ్మెల్యేలకు వ్యతిరేక గ్రూపులు
గుంటూరు జిల్లా పొన్నూరులో రావి వెంకట రమణ ఇన్ చార్జిగా ఉండగా, ఆయనను కాదని కిలారు రోశయ్యకు టికెట్ ఇవ్వడంతో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు వెంకట రమణ కాస్త అసంతృప్తి, అసమ్మతిగా ఉన్నారు. ఆయన వర్గం అక్కడ పెద్దదే. అలాగే గుంటూరు పశ్చిమలో ఎమ్మెల్యే క్యాండెట్ చంద్రగిరి ఏసురత్నం. అక్కడ టీడీపీ నుండి గెలిచిన మద్దాలి గిరి వైసీపీ చేరారు. ఇక్కడ వీళ్లద్దరి వర్గాలతో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అపిరెడ్డి వర్గం స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ మూడు వర్గాలు ఉన్నాయి. వీళ్లకు ఒకళ్లంటే ఒకళ్లకు పడదు. ఒకరికి టికెట్ ఇస్తే మిగతా వర్గాలు చేసే అవకాశం ఉండదు. ఈ నియోజకవర్గం వరకూ పెద్దలు కూర్చుని పరిష్కరించే అవకాశం ఉందని అంటున్నారు. అదే విధంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట, ప్రకాశం జిల్లా చీరాల, కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీలో గ్రూపులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య విభేదాలు
ప్రకాశంజిల్లాలో కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మహీదర్ రెడ్డి ఉన్నారు. ఈయన మాజీ మంత్రి. ఇదే నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తూమాటి మాధవరావుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యే వర్గం వేరు, ఎమ్మెల్సీ వర్గంవేరు. వచ్చే ఎన్నికల్లో తూమాటి మాధవరావు పోటీ చేయబోతున్నారంటూ ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది. ఇక్కడ కూడా వారి మధ్య విభేదాలు ఉన్నాయి. ఒకరి వల్ల మరొకరికి నష్టం తప్పదు. ఇదే జిల్లాలోని దర్శి లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి వర్గం, ఎమ్మెల్యే వేణుగోపాల్ వర్గాలు ఉన్నాయి. వీళ్ల మధ్య విభేదాల కారణంగానే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దర్శి మున్సిపాలిటీ వైసీపీ ఓడిపోయింది. అలాగే నగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాకు అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం ఉన్నాయి.
గ్రూపులను సమన్వయం చేయాలి
అదే విధంగా పాయికారావుపేటలో ఎమ్మెల్యేగా గోళ్ల బాబారావు ఉండగా ఆయనకు వ్యతిరేక వర్గం, అనుకూల వర్గం ఉంది. ఆయనకు టికెట్ ఇవ్వద్దంటూ పాయికారావుపేటలో ధర్నాలు కూడా జరిగాయి. అలానే పార్వతీపురంలో ఎమ్మెల్యేకి, గతంలో ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన నేతకు పడటం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే 15 నియోజకవర్గాల్లో సీరియస్ గ్రూపులు ఉన్నాయి. పార్టీ చాలా సీరియస్ గా తీసుకోవాల్సినవి ఇవి. మరో 12 నుండి 15 నియోజకవర్గాల్లో ఇప్పటి నుండి వర్గాలు తయారు అవుతున్నాయి. వీటి వల్ల కూడా నష్టం తప్పకపోవచ్చు. ఈ నియోజకవర్గాల్లో నష్టం జరగకుండా ఉండాలంటే పార్టీ గ్రూపులను సమన్వయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.