సాధారణంగా ఓ హీరోకు ఫ్లాప్స్ తో లాంగ్ గ్యాప్ వస్తే ఆ ఎఫెక్ట్ కెరీర్ పై ఖచ్చితంగా పడుతుంది. నేటి తరం హీరోలకు ఈ ఎఫెక్ట్ మరీ ఎక్కువ. కానీ.. మూడున్నర దశాబ్దాలుగా తెలుగు సినిమాను ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవికి మాత్రం ఇది వర్తించలేదు. ఫ్లాపులతో ఏడాదిపాటు సినిమాలు చేయకపోయినా.. రాజకీయాల వల్ల తొమ్మిదేళ్ల గ్యాప్ వచ్చినా చిరంజీవిపై ఎఫెక్ట్ ఏమాత్రం పడలేదు. ఖైదీ నెంబర్ 150 రికార్డులే ఇందుకు నిదర్శనం. బాక్సాఫీస్ వద్ద తానే నెంబర్ వన్ అని నిరూపించారు. నేటి జనరేషన్ లో హిట్టైతే కానీ రాని 100 కోట్ల కలెక్షన్లు, యూఎస్ లో 2 మిలియన్ల డాలర్ల వసూళ్లను చిరంజీవి వరుసగా రెండుసార్లు సాధించడం విశేషం.
కెరీర్లో మాస్ కధలతో తిరుగులేని స్థాయి అందుకున్న చిరంజీవి క్లాస్ సినిమాలు తక్కువగానే చేశారు. చారిత్రక కథాంశాలను టచ్ చేయలేదు. ఆ వెలితిని ‘సైరా.. నరసింహారెడ్డి’ నెరవేర్చుకున్నారు. భారతదేశపు తొలి స్వాతంత్ర సమరయోధుడి కథలో నటించారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై అక్టోబర్ 2తో ఏడాది పూర్తి చేసుకుంది. ఉయ్యాలవాడ నరసిహారెడ్డిగా చిరంజీవి శిఖరాగ్రస్థాయి నటన ప్రదర్శించారు. యాక్షన్ సన్నివేశాల్లో రౌద్రం, కళ్లతో అభినయం, భారీ డైలాగులు వెరసి చిరంజీవి వన్ మ్యాన్ షో చేశారు. క్లైమాక్స్ లో చిరంజీవి నటన సినిమాకే హైలైట్. తన నటనతో ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించారు.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సినిమాలో కీలకపాత్ర పోషించడం విశేషం. దర్శకుడు సురేందర్ రెడ్డి పనితనం, కష్టం ఈ సినిమాలో కనిపిస్తుంది. తన మేకింగ్ తో ప్రేక్షకుల్ని ఆ కాలానికి తీసుకెళ్లారని చెప్పాలి. పదేళ్లుగా చిరంజీవి కోసమే చూసారు పరుచూరి బ్రదర్స్. సాయిమాధవ్ బుర్రా తన కలం బలం చూపించారు. అమిత్ త్రివేది సంగీతం, జులియస్ ప్యాక్ మెన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ సినిమాకు ప్రాణం పోశాయి. నిర్మాతగా రామ్ చరణ్ భారీతనం చూపించారు. చిరంజీవి కెరీర్లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది.