విజయసాయి రెడ్డి vs పురంధేశ్వరి ఎపిసోడ్ 2.. వార్ మొదలైనట్టేనా..?

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి బీజేపీపై మళ్లీ కోపం వచ్చింది. పురంధేశ్వరి ఇంటర్వ్యూ చూసాక ఆయన తన ట్విట్టర్ కు పని చెప్పారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణను ఓ ఆట ఆడుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పురంధేశ్వరిపై కూడా ట్విట్టర్ బాణాలు ఎక్కుపెట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పురంధేశ్వరికి బీజేపీలో కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు విజయసాయి రెడ్డికి బాగానే కోపం తెప్పించినట్టున్నాయి. అందుకే.. విజయసారెడ్డి-పురంధేశ్వరి ఎపిసోడ్ 2 కు తెర లేచింది.

vijayasai reddy cast based comments purandheswari
vijayasai reddy cast based comments purandheswari

ఎన్నికల నిధులు తినేసారంటూ గతంలో తీవ్ర ఆరోపణలు..

2019 ఎన్నికల సందర్భంగా బీజేపీ అధిష్టానం నుంచి వచ్చిన డబ్బును కన్నా లక్ష్మీనారాయణతో కలసి పురంధేశ్వరి తినేసారని విజయసాయిరెడ్డి అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డికి ఉన్న నేర చరిత్ర తమకు లేదంటూ పురంధేశ్వరి కూడా కౌంటర్ ఇచ్చారు. కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేద్దాం రమ్మంటూ కన్నా – విజయసాయి రెడ్డి సవాల్ విసురుకున్నారు. విజయసాయిరెడ్డికి లీగల్ నోటీస్ పంపిస్తానంటూ కన్నా ఫైర్ అయ్యారు. ఆరోపణలు నిరూపించని పక్షంలో పదవులకు రాజీనామా చేయాలనేంత వరకూ వెళ్లారు. తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. ప్రస్తుతం కన్నా తన పదవిని కోల్పోయారు. పురంధేశ్వరి మాత్రం బీజేపీలో ఏకంగా ప్రమోషన్ తో జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు.

చిచ్చుపెట్టిన ఈనాడు ఇంటర్వ్యూ..

జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా పురంధేశ్వరి ఇచ్చిన ఇంటర్వ్యూ వీరిద్దరి మధ్యా చిచ్చు రేపింది. జగన్ పరిపాలన ఏమీ బాగోలేదని.. హైకోర్టులో ప్రభుత్వంపై వస్తున్న తీర్పులే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యలు చేశారు. జగన్ కు పరిపాలన చేయడం రావట్లేదని కూడా అన్నారు. హిందూ దేవాలయాలపై దాడుల గురించి కూడా ఆమె ప్రస్తావించారు. దీంతో విజయసాయిరెడ్డి.. ఆమె జాతీయ నాయకురాలిగా కాకుండా జాతి నాయకురాలిగా మాట్లాడారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పురంధేశ్వరి సామాజికవర్గాన్ని విజయసాయి రెడ్డి ప్రస్తావించడంపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య వైరం ఎటువైపు దారి తీస్తుందో అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.