గత కొద్ది రోజుల నుండి సరైన కంటెంట్ ఉన్న సినిమా రాకపోవడంతో.. ప్రేక్షకులు లేక థియేటర్స్ వెలవెలబోయాయి. కానీ, గత శుక్రవారం విడుదలైన `బింబిసార`, `సీతారామం` చిత్రాలు.. తొలి ఆట నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాదు వీకెండ్ తర్వాత కూడా హస్ ఫుల్ బోర్డ్స్ పడేలా చేశాయి.
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తొలి సోసియో ఫాంటసీ మూవీ `బింబిసార`. ఇందులో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో మల్లాడి వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. శుక్రవారం అట్టహాసంగా రిలీజ్ ఈ చిత్రానికి తొలి షో నుండే పాజిటివ్ రివ్యూలు రావడంతో.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో బీభత్సం సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ టార్గెట్‌ను రీచ్ అయిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 23.62 కోట్ల షేర్, రూ. 39.00 కోట్ల గ్రాస్ వసూళ్లతో బ్లాక్ బస్టర్ హిట్ లిస్ట్‌లో చేరిపోయింది.
ఇక `సీతారామం` విషయానికి వస్తే.. వార్ బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకున్న అద్భుతమైన ప్రేమకథ ఇది. ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. రష్మిక కీలక పాత్రను పోషించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కూడా మంచి స్పందన దక్కింది. అయితే కలెక్షన్స్ పరంగా తొలి రోజు కాస్త నిరాశ పరిచినా.. ఆ తర్వాత మాత్రం దుమ్ము దుమారం లేపుతోంది.
ప్రపంచవ్యాప్తంగా రూ. 18.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సీతారామం.. రూ. 19.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే ఐదు రోజుల్లో రూ. 16.47 కోట్ల షేర్, రూ. 32.70 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి.. బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు పెడుతోంది. ఇక రెండు, మూడు రోజుల్లో ఈ చిత్రం కూడా టార్గెట్ ను రీచ్ అవ్వడమే కాదు.. నిర్మాతలకు లాభాలను సైతం తెచ్చిపెడుతుందని అంటున్నారు.