మలయాళ స్టార్ మమ్ముట్టి తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. తనదైన టాలెంట్‌తో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్. `మహానటి` మూవీ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈయన.. తొలి సినిమాతోనే ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రీసెంట్గా దుల్కర్ తెలుగులో నటించిన చిత్రం `సీతారామం`.
హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తే.. రష్మిక మందన్న, సుమంత్, తరుణ్ భాస్కర్, భుమిక చావ్లా, గౌతం వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. యుద్ధ నేపథ్యంలో సాగే అద్భుతమైన ప్రేమ కథ ఇది. ఆగస్టు 5న తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం.. ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసేందుకు ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.
సౌత్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని ఇటీవలే బాలీవుడ్ లోనూ విడుదల చేశారు. అక్కడ సైతం ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం `సీతారామం` సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న దుల్కర్ సల్మాన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను పంచుకున్నాడు.
దుల్కర్ మాట్లాడుతూ.. `కెరీర్ ప్రారంభంలో నా సినిమాల రివ్యూ చదువుతూ ఉండేవాడిని అందులో ఎక్కువగా నా నటనను విమర్శిస్తూ నెగిటివ్ కామెంట్లు చేసే వారు. నాకు యాక్టింగ్ రాదని, నేను సినిమాలు ఆపేస్తే మంచిదని కోరుకున్నారు. నా తండ్రిలా నేను నటుడిగా రాణించలేనన్నారు. నేను ఇండస్ట్రీలో ఉండకూడదని కూడా కోరుకున్నారు. ఆ మాటలు నన్ను ఎంతగానో బాధించాయి` అంటూ దుల్కర్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఏదేమైనా అప్పుడు విమర్శించిన వారే.. ఇప్పుడు దుల్కర్‌పై, ఆయన నటనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.