గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతమవుతున్న మంచు విష్ణు.. ప్రస్తుతం `జిన్నా` అనే మూవీను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, సన్నిలియోన్ హీరోయిన్లుగా నటించారు. కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు.
విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల దీపావళికి రిలీజ్‌ను పోస్ట్ పోన్ చేశారు.

ఇది ఎలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ బయటకు వదిలారు. ఇందులో ఊరంత అప్పులు చేసే టెంట్ హౌజ్ ఓనర్ గాలి నాగేశ్వరరావుగా మంచు విష్ణు కనిపించబోతున్నాడు. `జిన్నా అంటే పొయ్యి మీద కరిగే వెన్న కాదు రా.. లోడ్ చేసిన గన్ను.. టచ్ చేస్తే దీపావళే` అంటూ హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసిన తీరు ఆకట్టుకుంది.
అలాగే మంచు విష్ణుతో సహా వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాంలు తమైదన పంచ్‌లతో అద్భుతంగా కామెడీని పండించారు. పాయల్ పల్లెటూరి యువతిగా, సన్నీలియోన్ మోడ్రన్ లేడీగా కనిపించబోతున్నారు. మొత్తానికి ఆధ్యంతం అలరిస్తున్న జిన్నా ట్రైలర్.. సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది.